Begin typing your search above and press return to search.

రూ.791 కోట్లు ఏం చేశావ్ కేసీఆర్?

By:  Tupaki Desk   |   24 April 2016 4:49 AM GMT
రూ.791 కోట్లు ఏం చేశావ్ కేసీఆర్?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఇలాంటి పాలకుడు ఏ పాతికేళ్ల ముందే తెలుగురాజకీయాల్లో ఫోకస్ అయి ఉంటే.. తెలుగు ప్రాంతం మరెంతగా వృద్ధి చెందుతుందో అనిపించక మానదు. అయితే.. కేసీఆర్ మాటలు విన్నప్పుడు కలిగే ఫీలింగ్.. ఆయన రాజకీయ ప్రత్యర్థులు చేసే కామెంట్లు విన్నప్పుడు మాత్రం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. అభివృద్ధి పనుల కోసం అప్పుల మీద అప్పులు తీసుకురావటం కనిపిస్తుంది. మరింత ఆదాయం కోసం ఉన్న ఆస్తుల్ని ఎడాపెడా అమ్మేయాలన్న ధోరణి తెలంగాణసర్కారులో కనిపిస్తుంది.

నిధుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసే తెలంగాణ సర్కారు.. కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఖర్చు చేయకుండా ఉంటుందా? అన్న డౌట్ రాక మానదు. కానీ.. ఆ మాట నిజమని చెబుతున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్. కరువు కోరల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం ఇచ్చిన నిధుల్ని కేసీఆర్ సర్కారు ఇప్పటికీ ఖర్చు చేయలేదంటూ చేసిన విమర్శ పలువురిని ఆకర్షిస్తోంది.

ఓపక్క నిధులు రాక కిందామీదా పడుతున్న వైఖరికి భిన్నంగా.. కేంద్రం డబ్బులు పంపాక కూడా ఖర్చు చేయకుండా ఉండటమా? అన్న డౌట్ రావటం ఖాయం. కానీ.. లక్ష్మణ్ మాత్రం కరువుకు చెక్ చెప్పేందుకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం పంపిన రూ.791 కోట్ల నిధులు ఇచ్చినట్లుగా వెల్లడించారు. వాటిని ఇప్పటివరకూ ఖర్చు చేయలేదన్న లక్ష్మణ్ మాటకు తెలంగాణ అధికారపక్షం ఏం సమాధానం చెబుతుంది? నిధుల్లేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. చేతిలో భారీగా నిధులు ఉంచుకొని కూడా పని చేయకపోవటం ఏమిటి? కేసీఆర్ రాజ్యంలో ఇలాంటివి కూడానా అన్న భావన తెలంగాణ బీజేపీ చీఫ్ మాటల్ని వింటే కలగటం ఖాయం. మరి.. లక్ష్మణ్ చెబుతున్న రూ.791కోట్ల లెక్క గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెబితే బాగుంటుంది.