Begin typing your search above and press return to search.

టీడీపీతో దోస్తీ ఉండ‌ద‌ని చెప్పేసిన బీజేపీ

By:  Tupaki Desk   |   26 March 2017 6:15 AM GMT
టీడీపీతో దోస్తీ ఉండ‌ద‌ని చెప్పేసిన బీజేపీ
X
తెలంగాణలో ఇప్ప‌టికే క‌ష్ట‌కాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మ‌రో షాకింగ్ వార్త‌. ఇప్ప‌టివ‌ర‌కు మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ-టీడీపీల బంధం బీటలు వారిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్న క్ర‌మంలో దీన్ని నిజం చేసే అధికార ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఒంటరి పోరాటానికి ఇప్ప‌టి నుంచే సిద్ధం అవుతున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో పార్టీని పటిష్ట పరిచి బూత్‌ల వారీగా సమీక్షలు జరుపుతున్నామని, టీఆర్ఎస్‌ సర్కారు వైఫల్యాలే తమను అధికారంలోకి తెస్తాయని తెలిపారు. రానున్న ఎన్నికలకు తమ బ్రహ్మాస్త్రం ప్రధానమంత్రి నరేంద్రమోడీయేనని ఆయన చెప్పారు. ఈసారి అధికారం తమదేన‌ని ల‌క్ష్మ‌ణ్ ధీమా వ్య‌క్తం చేశారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సర్కారు ఎన్నో తప్పిదాలకు పాల్పడుతోందని, అవే బీజేపీకి అనుకూల అంశాలు అవుతాయని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ-విద్య- వైద్య-ఆరోగ్య- గ్రామీణాభివృద్ధి-గృహనిర్మాణ- సంక్షేమ రంగాలతో పాటు సాగునీటి ప్రాజెక్టుల విషయమై తెరాస సర్కారు చెప్పింది ఎక్కువగానూ, చేసింది తక్కువగానూ ఉందని ల‌క్ష్మ‌ణ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్‌లో మూడింట ఒక వంతు నిధులు కేంద్రం ఇచ్చినవేనని ఆయ‌న విశ్లేషించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమేగాక, కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామన్నారు. ఎన్నికలే లక్ష్యంగా కాకుండా రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ ప్రజాసమస్యలపై ప్రత్యక్ష పోరు నిర్వహిస్తామని ల‌క్ష్మ‌ణ్‌ చెప్పారు.

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మంచి ఫలితాలను ఇస్తున్నాయని, వాటిని ప్రజలు హర్షిస్తున్నారని, తెలంగాణలో సైతం మోడీ ప్రభంజనం వీస్తోందని లక్ష్మణ్ తెలిపా. తమ పార్టీకి ప్రజలే బాహుబలులని, వారే బీజేపీకి బ‌లం చేకూరుస్తార‌ని ల‌క్ష్మ‌ణ్ విశ్లేషించారు. తెలంగాణలో మండలస్థాయి వరకూ కమిటీలను వేసి, ప్రజాస్వామిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఏకైక పార్టీ తమదేనని అన్నారు. మిగ‌తా విప‌క్షాల‌న్నీ వైఫ‌ల్యం చెంద‌డం, బీజేపీ విధానాలు న‌చ్చ‌డంతో ప్ర‌జ‌లు త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని ల‌క్ష్మ‌ణ్ ధీమా వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/