Begin typing your search above and press return to search.

ఏపీలో జేపీ న‌డ్డా 2022 జోక్ పేల్చాడు!

By:  Tupaki Desk   |   6 Jun 2022 5:30 PM GMT
ఏపీలో జేపీ న‌డ్డా 2022 జోక్ పేల్చాడు!
X
రాజ‌కీయ నేత‌లు.. కామెంట్లు ష‌రా మామూలే. కానీ, జోకులు..! ఏపీలో ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు.. కేఏ పాల్ వేసే జోకులు అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ఏం మాట్లాడినా.. జోక్‌గానే ఉంటుంది. మాట్లాడేదంతా కూడా జోకుల మ‌యంగానే ఉంటుంది. ఇప్పుడు ఇదే కోవ‌లో మ‌న‌కు కొత్త పాల్ దొరికాడా?.. అన్న‌ట్టుగా ఉంది బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా వ్య‌వ‌హారం. తాజాగా ఆయ‌న ఏపీలో ప‌ర్య‌టించారు. విజ‌య‌వాడ‌లో శ‌క్తి కేంద్రాల ప్ర‌ముఖ్‌ల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పెద్ద జోక్ పేల్చారు. అది కూడా `2022 జోక్‌` అనే రేంజ్‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇదే అంటున్నారు.. నెటిజ‌న్లు కూడా!

శ‌క్తి కేంద్రాల ప్ర‌ముఖ్‌ల‌తో మాట్లాడిన న‌డ్డా.. ఏమ‌న్నారంటే.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు.. కరెంటు కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ప్ర‌ధాని మోడీ అందించే సాయాన్ని జగన్ సొంత పథకంగా చెబుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి బీజేపీ అవసరం చాలా ఉందని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని నడ్డా పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో 46వేలకు పైగా పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయని.. బూత్‌ల వారీగా ప్రజల వద్దకు పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత శక్తి కేంద్ర ప్రముఖులపై ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ మాయమాటలు ప్రజలకు వివరించాలని ఈ సందర్బంగా సూచించారు. ప్రతి బీజేపీ కార్యకర్త తమ ఇంటిపై పార్టీ జెండా ఎగురవేయాలని నడ్డా సూచించారు. మన్‌కీ బాత్‌ ద్వారా ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చే సందేశాన్ని బూత్‌ స్థాయిలో కార్యకర్తలంతా సామూహికంగా వీక్షించాలన్నారు. ఆ తర్వాత ప్రధాని సందేశాన్ని అక్కడి ప్రజలతో చర్చించి వారికి చేరవేయాలన్నారు.

ప‌నిలో ప‌నిగా పెద్ద‌జోక్‌!!

ఇక, ప‌నిలో ప‌నిగా.. న‌డ్డా పెద్ద జోక్ వేశారు. రాష్ట్రంలో జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కంగా చెప్పుకొచ్చారు. కేంద్రంలోని మోడీ స‌ర్కారు అమ‌లు చేస్తున్న ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని పేరు మార్చి ఏపీలో ఆరోగ్య శ్రీగా అమ‌లు చేస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. ఈ ప‌థ‌కంలో దేశంలో ఎక్కడైనా చికిత్స‌ను ఉచితంగా చేయించుకోవ‌చ్చ‌ని సెల‌విచ్చారు. అయితే.. ఈ కామెంట్‌పైనే నెటిజ‌న్‌లు ప‌గల‌బ‌డి న‌వ్వుతున్నారు.

ఎందుకంటే.. ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని ఉమ్మ‌డి రాష్ట్రంలో అందునా..కేంద్రంలో యూపీఏ స‌ర్కారు ఉన్న స‌మ‌యంలో అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి తీసుకువ‌చ్చారు. పేద‌ల‌కు కూడా కార్పొరేట్ వైద్యం అందాల‌నే ఏకైక ల‌క్ష్యంతో ఆయ‌న తొలుత `రాజీవ్ ఆరోగ్య శ్రీ` పేరుతో దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేశారు. త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగినా.. ప్ర‌భుత్వాలు మారినా.. ఈ ప‌థ‌కం మాత్రం పేర్లు మార్చి అమ‌లు చేస్తున్నారు. అయితే.. దీనిని కూడా న‌డ్డా త‌న ఖాతాలో వేసుకోవ‌డం.. జోక్ కాక‌మరేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు నెటిజ‌న్లు.

ఏదైనా సీనియ‌ర్ నాయ‌కుడు.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడి హోదాలో ఉన్న న‌డ్డా.. వాస్త‌వాలు తెలుసుకుని మాట్లాడితే.. బాగుండేద‌ని.. అంటున్నారు. లేని దానిని, త‌మ‌ది కాని దానిని.. కూడా త‌మ ఖాతాలో వేసుకునేందుకు వెంప‌ర్లాడ‌డం ఎందుకు? అని నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.