Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీ ఎవరి చేతికి?

By:  Tupaki Desk   |   28 Feb 2016 11:30 AM GMT
తెలంగాణ బీజేపీ ఎవరి చేతికి?
X
తెలంగాణ బీజేపీ కొత్త సారథి ఎవరో త్వరలో ప్రకటించనున్నారు. ఇప్పటికే ఫైనల్ లిస్ట్ అమిత్ షా చేతిలో ఉందని... ఆయన అన్ని ఈక్వేషన్లను పరిశీలించి డిసైడ్ చేస్తారని తెలుస్తోంది.

కాగా ఈసారి బీజేపీ సారథ్యం కొత్త వర్గాలకు దక్కుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. గత 15 ఏళ్లుకు పైగా రెడ్డి సామాజికవర్గ నేతలకే సారథ్య బాధ్యలను కట్టబెడుతున్నారని,ఆ పార్టీకి చెందిన బీసీ - ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కొంత మంది సీనియర్ నేతలు పేర్కొంటే... ఈసారి తమకు ఛాన్సివ్వాలని అధిష్టానానికి మొరబెట్టుకున్నట్లు తెలిసింది. ఆ మేరకు ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్సు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో చిత్తూరు జిల్లాకు చెందిన చిలకం రాంచంద్రారెడ్డి - నల్లు ఇంద్రసేనా రెడ్డితో పాటు కిషన్‌ రెడ్డి కూడా సారథ్య బాధ్యతలను చేపట్టారు. అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సైతం కిషన్‌ రెడ్డి వరుసగా రెండవసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించారు. కాగా... కిషన్‌ రెడ్డి పదవీ కాలం గత డిసెంబర్‌ నాటికే ముగిసింది. కానీ జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం ఆయననే ఆ స్థానంలో కొనసాగించింది. జీహెచ్ ఎంసీ ఎన్నికలకు మందే కిషన్‌ రెడ్డి సారథ్య బాధ్యతలపై అదే పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు గుప్పించి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కిషన్‌ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికలల్లో బీజేపీకి చేదు అనుభవమే మిగిలింది. కేంద్రంలో అధికారం చేపట్టిన నాటినుంచి పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని, గ్రామీణ స్థాయినుంచి పార్టీని పటిష్టం చేయకపోవడం వల్లే పార్టీ ప్రతిష్ట నానాటికీ దిగజారుతోందని కిషన్‌ రెడ్డి వ్యతిరేక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు పర్యాయాలు పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన కిషన్‌ రెడ్డి సారథ్యంలో ఏ ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ విజయాలను సాధించలేక పోయారనే విమర్శలు కోకొల్లలు. కిషన్‌ రెడ్డి సైతం తాను పదవి నుంచి వైదొలుగుతానని కేంద్ర కమిటికి నివేదించినట్లు సమాచారం.

కాగా కిషన్ రెడ్డి స్థానంలో అధ్యక్ష పదవి ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ ను వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన న్యాయవాధి రాంచందర్‌ రావు తనకు అవకాశం కల్పించాలని అధిష్టానం వద్ద మొరబెట్టుకున్నట్లు తెలిసింది. అలాగే నల్లగొండ జిల్లా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆ పార్టీ సీనియర్ నేత చింతా సాంబమూర్తి పేరు కూడా పరిశీలనలో ఉంది. నిజామాబాద్‌ కు చెందిన మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ - ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి సైతం తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఏదైనా ఈ వారంలో నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.