Begin typing your search above and press return to search.

షా నోటి నుంచి సౌత్‌.. నార్త్ మాట‌!

By:  Tupaki Desk   |   1 April 2018 5:06 AM GMT
షా నోటి నుంచి సౌత్‌.. నార్త్ మాట‌!
X
కొన్ని విష‌యాల్ని అస్స‌లు ప‌ట్టించుకోన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు రాజ‌కీయ అధినేత‌లు అదెంత త‌ప్ప‌న్న విష‌యం వారికి త‌ర్వాత కానీ అర్థం కాదు. చిన్నపామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్టాల‌న్న ప్రాధ‌మిక స‌త్యాన్ని మ‌ర్చిపోవ‌టం ఎంత త‌ప్ప‌న్న విష‌యం ఇప్పుడు మోడీషాల‌కు అర్థ‌మ‌వుతూ ఉంటుంది. అదెలా చెబుతారంటారా? అమిత్ షా లాంటోడి నోటి సౌత్.. నార్త్ ముచ్చ‌ట రావ‌ట‌మే.

నార్త్ కు పెద్ద‌పీట వేస్తూ.. సౌత్ ను చిన్న‌చూపు చూస్తున్నార‌ని.. దేశ వ్యాప్తండా ఎడెనిమిది రాష్ట్రాల సంప‌ద‌న‌ను తీసుకొని దేశం మొత్తానికి స‌ర్దేస్తున్నార‌ని.. ఆ సంప‌న్న రాష్ట్రాల్లో అత్య‌ధిక సౌత్ కు చెందిన రాష్ట్రాలేనంటూ ఇటీవ‌ల కాలంలో వినిపిస్తున్న విమ‌ర్శ‌ల‌పై షా సైతం స్పందిచ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

సౌత్..నార్త్ ల మ‌ధ్య వ్య‌త్యాసాలు.. రెండింటిని పోల్చుకోవ‌టం లాంటివి పిల్ల పార్టీలైన ప్రాంతీయ పార్టీలు చేస్తుంటాయ‌న్న చిన్న‌చూపు చాలామందిలో ఉంటుంది. ఇలాంటి వాటికి అస్స‌లు ప్ర‌యారిటీ ఇవ్వొద్ద‌న్న మాట‌ను కొంత‌మంది మేధావులు చెబుతుంటారు.కానీ.. భావోద్వేగ అంశాలుగా మారి.. దేశ స‌మ‌గ్ర‌త‌కు ముప్పు వాటిల్లేలా చేసే ఈ త‌ర‌హా అంశాల‌పై మొద‌ట్లోనే నోరు విప్పాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. అదేమీ చేయ‌కుండా .. జాతీయ పార్టీల‌న్న అహంకారంతో వ్య‌వ‌హ‌రించే షా బాప‌తు లాంటి నేత‌లకు వాస్త‌వం కాస్త ఆల‌స్యంగా అర్థ‌మ‌వుతూ ఉంటుంది.

ఏడాది.. అంత దాకా ఎందుకు.. అర్నెల్ల క్రితం వ‌ర‌కూ సౌత్.. నార్త్ అన్న తేడాపై మాట్లాడేందుకు చాలామంది నేత‌లు ఇష్ట‌ప‌డే వారు కాదు. కానీ.. ఇప్పుడు ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులే నేరుగా ఈ త‌ర‌హా విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

మామూలుగా అయితే షా లాంటోడి నోటి నుంచి సౌత్.. నార్త్ లొల్లిపై నోరు విప్పే వారు కాదు. బీజేపీ ప్ర‌తిష్ఠ‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో సౌత్. నార్త్ మ‌ధ్య ఎలాంటి తేడా లేద‌ని..త‌మకు అన్ని రాష్ట్రాలు స‌మాన‌మేన‌న్న మాట‌ను చెప్ప‌ని ప‌రిస్థితి.

సౌత్..నార్త్ ఇష్యూకు సంబంధించి ప‌లు ఉదాహ‌ర‌ణ‌లు ఈ మ‌ధ్య‌న తెర మీద‌కు రావ‌టం.. వాటిపై మోడీషా ద్వ‌యం స‌రైన క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌టం.. విమ‌ర్శ‌లు వినిపించినంత బ‌లంగా.. వాటికి కౌంట‌ర్ రాని నేప‌థ్యంలో సౌత్.. నార్త్ మాట త‌ర‌చూ తెర‌పైకి వ‌స్తున్న ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. సౌత్ ను త‌క్కువ‌గా చూడ‌టం లేద‌ని.. నార్త్ కు పెద్ద‌పీట వేయ‌టం లేద‌న్న మాట‌ను షా నోట బ‌లంగా చెప్ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. కేంద్ర ప్ర‌భుత్వ నిధుల కేటాయింపులో తాము సౌత్‌.. నార్త్ అన్న‌తేడాల‌తో చూడ‌టం లేద‌ని.. ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌న్న ఆరోప‌ణ‌లో ఎలాంటి నిజం లేద‌న్న మాటను బ‌లంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు షా.

క‌ర్ణాట‌క‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన షా నోట సౌత్‌.. నార్త్ మాట బ‌లంగా వినిపించ‌ట‌మే కాదు.. త‌మ‌పై చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో ఎంత‌మాత్రం నిజం లేదంటూ త‌న వాద‌న‌ను వినిపిస్తున్న తీరు చూస్తే.. మోడీషాల ప‌క్ష‌పాతంపై ద‌క్షిణాదికి చెందిన ప‌లువురు చూస్తున్న విమ‌ర్శ‌లు వారి వ‌ద్ద‌కు వెళ్ల‌ట‌మే కాదు.. వారిని సైతం అలెర్ట్ చేస్తున్న ప‌రిస్థితి.

జ‌ర‌గాల్సిన డ్యామేజ్ అంతా జ‌రిగిపోయిన త‌ర్వాత ఆల‌స్యంగా క‌ళ్లు తెరిచిన షా.. న‌ష్ట నివార‌ణ ప్ర‌య‌త్నం మొద‌లెట్టిన‌ట్లుగా క‌నిపిస్తోంది. సౌత్ ను చిన్న చూపు చూడ‌టం లేదు.. త‌మ‌కు రాష్ట్రాల‌న్ని స‌మాన‌మేన‌న్న మాట చెప్పే బ‌దులు..దానికి ద‌న్నుగా గ‌ణాంకాలు చూపిస్తే బాగుంటుంది క‌దా? మాట‌లు ఎలా ఉన్నా చేత‌ల్ని కూడా ప్ర‌జ‌లు మ‌దింపు చేస్తార‌న్న విష‌యాన్ని షా గుర్తిస్తే మంచిది. లేనిప‌క్షంలో.. షా క‌వ‌రింగ్ ద‌క్షిణాది వారికి మ‌రింత ఒళ్లు మండేలా చేస్తే మ‌రింత న‌ష్టం ఖాయం.