Begin typing your search above and press return to search.

కర్ణాటకలో బీజేపీ కుదురుకోలేకపోతోందా?

By:  Tupaki Desk   |   13 Aug 2019 2:46 PM IST
కర్ణాటకలో బీజేపీ కుదురుకోలేకపోతోందా?
X
కేబినెట్ ను ఇంత వరకూ ఏర్పాటు చేయకపోవడంతో కర్ణాటకలో బీజేపీ కుదురుకోలేకపోతోందా? అనే సందేహాలు ధ్వనిస్తున్నాయి. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా సీఎంగా కుమారస్వామి - డిప్యూటీ సీఎంగా పరమేశ్వర్‌ ప్రమాణస్వీకారం అనంతరం 14 రోజులకు మంత్రివర్గం ఏర్పాటు చేశారు. అయితే యడియూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 16 రోజులు దాటినా.. మంత్రి వర్గం ఏర్పాటు కాలేదనే విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీ లోపు మంత్రివర్గ విస్తరణ చేపట్టేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా కేబినెట్‌ లో ఎవరికి చోటు ఇవ్వాలనే దానిపై అమిత్‌ షా వద్ద ఇప్పటికే ఒక జాబితా ఉంది. ఈనేపథ్యంలో మరోసారి యడియూరప్ప కొన్ని పేర్లు పరిశీలించాలని కోరారు. అయితే ఢిల్లీలో చర్చించి ఫైనల్‌ చేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

మంత్రివర్గంలో భాగంగా తొలివిడతలో 12 మందికి అవకాశం ఇస్తారని తెలిసింది. బుధవారమే 12 మంది కొత్త మంత్రులతో ప్రమాణం చేయించి శాఖలు కూడా అదే రోజు అప్పగిస్తారని సమాచారం. ఇందులో భాగంగా సీనియర్‌ నాయకులు మొత్తం 12 మందికి తొలివిడతలో మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. కాగా అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత రెండోవిడత మంత్రివర్గం భర్తీ చేస్తారని తెలిసింది.