Begin typing your search above and press return to search.

క‌మ‌లంతో త‌లైవా దోస్తీ క‌ట్టేసిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   7 Aug 2017 3:10 PM IST
క‌మ‌లంతో త‌లైవా దోస్తీ క‌ట్టేసిన‌ట్టేనా?
X
త‌మిళ తంబీలు త‌లైవాగా పిలుచుకునే సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ రాజకీయ రంగ ప్ర‌వేశంపై రోజుకో వార్త బ‌య‌ట‌కు వ‌స్తోంది. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం త‌మిళ నాట ఏర్ప‌డ్డ రాజ‌కీయ శూన్య‌త‌ను పూరించడం మ‌రో సినీ స్టార్‌కే సాధ్య‌మ‌వుతుంద‌ని, ఆ శ‌క్తి ఒక్క ర‌జ‌నీకాంత్‌కే ఉందంటూ త‌మిళ తంబీలు ఎప్పటినుంచో భావిస్తున్నారు. అంతేకాకుండా త‌క్ష‌ణ‌మే రాజకీయాల్లోకి రావాలంటూ ఆయ‌న‌కు వేలాది మంది అభిమానులు విజ్ఞ‌ప్తి చేయ‌గా, మ‌రికొంద‌రు ఏకంగా బ్యాన‌ర్లు క‌ట్టి... తమిళ‌నాడు భావి సీఎం ర‌జ‌నీనేనంటూ తీర్పు కూడా ఇచ్చేశారు. మ‌రోవైపు ర‌జ‌నీ కూడా రాజ‌కీయ తెరంగేట్రం చేసే దిశ‌గానే అడుగులు వేస్తున్నార‌ని, అయితే అంత వ‌డివ‌డిగా కాకుండా ఆచితూచి ఆయ‌న వేస్తున్న స్టెప్పులు స‌మీప భ‌విష్య‌త్తులోనే త‌లైవా రాజ‌కీయాల్లోకి రావ‌డం ఖాయ‌మ‌న్న భావ‌న‌ను క‌లిగిస్తున్నాయి.

ప్రాంతీయాభిమానానికి పెద్ద‌న్న‌లా వ్య‌వ‌హ‌రిస్తున్న తమిళ‌నాడులో జాతీయ పార్టీలు ఇప్ప‌టిదాకా పెద్ద‌గా పొడిచిందేమీ లేదు. స‌మీప భ‌విష్య‌త్తులో అక్క‌డి స్థానిక ప్రాంతీయ పార్టీల‌ను కాద‌ని జాతీయ పార్టీలు పొడిచేది కూడా పెద్ద‌గా ఏమీ ఉండబోద‌న్న వాద‌న కూడా కాస్తంత గ‌ట్టిగానే వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో అక్క‌డి స్థానిక పార్టీ... లేదంటే ప్ర‌జాక‌ర్ష‌క శ‌క్తి క‌లిగిన నేత కోసం జాతీయ పార్టీలు వెంప‌ర్లాడుతున్న వైనం ఇప్పుడు మ‌న‌కు అత్యంత స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే డీఎంకేతో దోస్తీ క‌ట్టిన కాంగ్రెస్ పార్టీ... డీఎంకే చీఫ్ క‌రుణానిధి ఇంటిలో ఏ చిన్న కార్య‌క్ర‌మం జ‌రిగినా... త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు వేయించుకుంటున్న విష‌యం జ‌గ‌మెరిగిన స‌త్య‌మే.

ఇక ఉత్త‌రాదిని దాదాపుగా ఊడ్చేసిన బీజేపీ ఇప్పుడు దక్షిణాదిపై ప్ర‌త్యేక దృష్టి సారించింది. మిగిలిన రాష్ట్రాల ప‌రిస్థితి ఎలా ఉన్నా... రాజ‌కీయ శూన్య‌త నెల‌కొన్న త‌మిళ‌నాడులో ఎలాగైనా పాదం మోపాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న క‌మ‌ల‌నాథులు ఇప్పుడు ఓ పెద్ద ప్లాన్ తోనే ముందుకు సాగుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే జ‌య విడిచివెళ్లిపోయిన అన్నాడీఎంకే ఎలాగూ బీజేపీ చేతి కింద‌కు వెళ్లిపోయింది. అయితే జ‌య లేని అన్నాడీఎంకేతో బీజేపీకి పెద్ద‌గా లాభించే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఈ కార‌ణంగానే క‌మ‌ల‌నాథుల దృష్టి ఇప్పుడు తమిళ త‌లైవా ర‌జ‌నీకాంత్ పై ప‌డిపోయింది. మొన్న‌టిదాకా ఈ త‌రహా వార్త‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఖండిస్తూ వ‌స్తున్న బీజేపీ... ఇప్పుడు ఏకంగా త‌న దూత‌ల‌ను త‌లైవా ఇంటికి పంపింది. బీజేపీ ఎంపీ పూన‌మ్ మ‌హాజ‌న్‌, పార్టీ కీల‌క నేత ముర‌ళీధ‌ర్ రావులు తాజాగా తలైవా ఇంటిలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

చెన్నైలో బీజేపీ నిర్వ‌హిస్తున్న ఓ ర్యాలీలో పాలుపంచుకునేందుకు వ‌చ్చిన వీరిద్ద‌రూ... ర‌జ‌నీకాంత్ ఇంటికి వెళ్లారు. ర‌జ‌నీతో వారు సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ర‌జ‌నీతో భేటీలో ఎలాంటి రాజ‌కీయ అంశాలు ప్ర‌స్తావ‌న‌కు రాలేదంటూ ఆ త‌ర్వాత వారిద్ద‌రూ ప్ర‌క‌టించినా... అంత అవ‌స‌రం లేకుంటే... ఏకంగా ఓ ఎంపీ స్థాయి నేత‌తో పాటు ద‌క్షిణాది రాష్ట్రాల బీజేపీ వ్య‌వ‌హారాల్లో కీల‌క భూమిక పోషిస్తున్న ముర‌ళీధ‌ర్ రావు లాంటి వారు ఎందుకు వెళ‌తార‌న్న అంశం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక రజనీ, ఆయన భార్య లత తదితరులతో తాను దిగిన ఫోటోలను ట్విట్టర్ లో పంచుకున్న పూనమ్... తాను కలుసుకున్న ఆత్మీయుల్లో లతాజీ - రజనీ జంట ఒకటంటూ వ్యాఖ్యానించి త‌లైవాతో భేటీకి మ‌రింత క‌ల‌రింగ్ ఇచ్చేశారు. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?