Begin typing your search above and press return to search.

ఒంటరి పోటీ.. బీజేపీకి తెలంగాణ కల్లే? 100లో 60 ఎలా?

By:  Tupaki Desk   |   1 Sep 2022 4:30 PM GMT
ఒంటరి పోటీ.. బీజేపీకి తెలంగాణ కల్లే? 100లో 60 ఎలా?
X
తెలంగాణపై కాషాయ జెండా ఎగురవేయాలని తాపత్రయపడుతున్న బీజేపీకి ఎన్నికల్లో కలిసివచ్చే మిత్రపక్షాలే లేవు. ఎందుకంటే ఇక్కడి పార్టీలన్నీ ఆ పార్టీ భావజాలంతో విభేదించేవే. బీజేపీని తీవ్రంగా దునుమాడే ఆ పార్టీలు.. అవసరమైతే వ్యతిరేకంగా జట్టు కడతాయి కూడా. మిగతా రాష్ట్రాల్లో ఇలా కాదు. ఉదాహరణకు మహారాష్ట్రనే చూస్తే.. 2019కి ముందు మూడు దశాబ్దాలుగా శివ సేన పార్టీ బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షం. ఒకటీ, అరా చిన్న పార్టీలు కూడా కమల దళంతో కలిసివెళ్లేవి. అయితే, 2019 తర్వాత శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో బీజేపీకి ఊహించని దెబ్బ తగిలింది. ఇటీవల శివసేన సర్కారును కూల్చిన విషయం వేరే అధ్యాయం. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో చూస్తే.. కర్ణాటకలో కొన్నిసార్లు జేడీఎస్, ఒడిశాలో నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ, తమిళనాడులో అన్నాడీఎంకే, ఉత్తరాదిలో కొన్ని పార్టీలు బీజేపీతో కలిసి నడిచాయి. నడుస్తున్నాయి కూడా.

తెలంగాణ పూర్తి భిన్నం

తెలంగాణ విషయానికి వచ్చేసరికి పూర్తి భిన్నమైన పరిస్థితి. ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. బీజేపీపై ఒంటి కాలిమీద లేస్తోంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. బీజేపీకి వ్యతిరేకంగా ఏకంగా ప్రత్యామ్నాయ కూటమే రావాలంటున్నారు. ఇందులో భాగంగా పార్టీలను కూడగడుతున్నారు. తాజాగా బిహార్ వెళ్లి సీఎం నీతీశ్ కుమార్ తో సమావేశం అయ్యారు.

అంటే.. తెలంగాణలో బీజేపీకి టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సానుకూలం కాదని చెప్పవచ్చు. ఇక కాంగ్రెస్.. జాతీయ స్థాయిలోనే వైరుధ్యాలున్న పార్టీ. తెలంగాణలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చాక దూకుడు మీద వెళ్తోంది. తమ అసలు ప్రత్యర్థి టీఆర్ఎస్ మాత్రమేనని, బీజేపీ కానే కాదనేది టీపీసీసీ ఉద్దేశంగా కనిపిస్తోంది. వామపక్షాలు బీజేపీకి పూర్తి సైద్ధాంతిక వ్యతిరేకం. అవసరమైతే బీజేపీ గెలిచే నియోజకవర్గాల్లో.. తాము గెలవలేకున్నా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కు తమ మద్దతు తెలపడం ద్వారా బీజేపీని ఓడించే లక్ష్యంతో ఉంటాయి.

చిన్నా చితక పార్టీలు కలిసిరావు

టీజేఎస్, బీఎస్సీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ, ఇంకా చెప్పాలంటే అనేక చిన్న పార్టీలున్నాయి. తెలంగాణలో ఇవేవీ బీజేపీకి కలిసి వచ్చేవి కావు. అంటే.. తెలంగాణలో బీజేపీ పోటీ చేస్తే ఒంటరి గానే. పొత్తులకు వీలే లేదన్నమాట. దీన్ని గ్రహించే ఏమో..? లేదా ఎవరైనా పొత్తుకు వస్తారా? అనే ఆశతోనో ఏమో? తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు లేవు అని బీజేపీ చెబుతోంది. ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ లక్ష్మణ్ మరోసారి ఇదే మాట చెప్పారు.

119లో 19 తీసినా.. ప్రతి 10లో 6 గెలవాల్సిందే

తెలంగాణలో పాత బస్తీ సహా హైదరాబాద్ పరిసరాల్లోని 12 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ. వీరు ఎన్నికల్లో పూర్తిగా లౌకిక పార్టీల వైపే మొగ్గు చూపుతారనడంలో సందేహం లేదు. బీజేపీకి ఓటు వేసే విషయంలో వీరి వేరొక సందేహమే లేదు. జిల్లాల్లో మరో 10 నియోజకవర్గాల్లోనూ ముస్లింల ఓట్లు నిర్ణయాత్మకం.

అంటే.. మొత్తం మీద 19 నియోజకవర్గాలను తీసివేస్తే.. మిగిలేవి 100 అనుకుందాం. వీటిలోనే బీజేపీ అధికారానికి మెజారిటీ మార్కు 60 చేరాలి. అంటే.. ఫస్ట్ క్లాస్ లో పాసవ్వాలి. ఒకరకంగా చెప్పాలంటే బీజేపీ తెలంగాణలో టీ20 క్రికెట్ ఆడాలి. ప్రతి 10 నియోజకవర్డాల్లో కనీసం 6 గెలవాలి. బీజేపీ వేవ్ సునామీలా విరుచుకుపడితే తప్ప దీనిని ఊహించలేం. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి ఉన్న ప్రజలు రాష్ట్రంలో బీజేపీని ఆదరిస్తారా? అంటే కష్టమే అని చెప్పాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.