Begin typing your search above and press return to search.

తెలంగాణలోకి రంగంలోకి దిగుతున్న బీజేపీ.. ఫిబ్రవరి 1 నుంచి గేమ్ ప్లాన్

By:  Tupaki Desk   |   17 Jan 2023 4:55 AM GMT
తెలంగాణలోకి రంగంలోకి దిగుతున్న బీజేపీ.. ఫిబ్రవరి 1 నుంచి గేమ్ ప్లాన్
X
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 'ప్రజా భరోసా యాత్ర' పేరుతో గ్రామాలను చుట్టివస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పార్టీకి ఆదరణ రాలేదని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

పలు సర్వేల ద్వారా ఈ విషయాన్ని గ్రహించిన ఢిల్లీ పెద్దలు మరో కొత్త వ్యూహాన్ని రచించారు. ఫిబ్రవరి 1 నుంచి పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో పటిష్టం చేయనున్నారు. ఈ మేరకు స్థానిక నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గ స్థాయిలో నాయకులు పార్టీ కోసం ఇక సీరియస్ గా పనిచేయాలని సూచించినట్లు సమాచారం.

ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరికి వారు సొంత ఇమేజ్ కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఒక వర్గంలో పార్టీకి బలం పెరుగుతున్నా.. క్షేత్రస్థాయిలో పార్టీ వెళ్లలేదని అర్థమవుతోంది. చాలా గ్రామాల్లో బీజేపీపై ఇంకా ఆదరణ పెరగలేదన్నది తేలింది.

ఈ మేరకు పకడ్బందీ వ్యూహంతో గ్రామాల్లో కాషాయ జెండా కనిపించేలా స్థానిక నాయకులు పనిచేయాలని ఢిల్లీ పెద్దలు సూచించనట్లు సమాచారం. అయితే కీలక నాయకులకు క్షేత్రస్థాయిలో పనిచేయడం కోసం పలు రకాల టాస్క్ లను అప్పగించనున్నారు.

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి మద్దతు లభిస్తోంది. అయితే దీనిని ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు నాయకులు పనిచేయాలని సూచిస్తున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 1 నుంచి దీనిని అమలు చేయనున్నారు. ఇప్పటి నుంచి ఏకంగా 11 వేల సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించింది. 119 నియోజకవర్గాల్లో తొమ్మిదివేల శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 56 బూత్ కమిటీలకు ఒక శక్తి కేంద్రం పనిచేస్తుంది. ఒక బూత్ స్థాయిలో ఎన్నికల నిర్వహణ కోసం కమిటీలు వేయనున్నారు. ప్రతీ శక్తి కేంద్రానికి ఒక ప్రముఖ్ ను నియమించి పార్టీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమాలతో పాటు ఇదే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలు పర్యటించే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. వీరే కాకుండా కేంద్ర మంత్రులు, ముఖ్య నాయకులు ఇదే నెలలో పర్యటిస్తారు. అయితే నేతల కొరత ఉన్న ప్రాంతాల్లో బలోపేతం చేయడానికి వివిధ పార్టీల్లో ఉన్న బలమైన నేతలను చేర్చుకోనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఢిల్లీ పెద్దలు సూచించినట్లు సమాచారం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.