Begin typing your search above and press return to search.

తెలంగాణ‌ లో బీజేపీకి స‌ర్వే చేయ‌లేం!.. ఎందుకంటే!!

By:  Tupaki Desk   |   4 March 2022 12:30 PM GMT
తెలంగాణ‌ లో బీజేపీకి స‌ర్వే చేయ‌లేం!.. ఎందుకంటే!!
X
తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌కంగా మారాల‌ని.. తాము అడుగులు కాదు..ప‌రుగులు పెట్టాల‌ని భావిస్తున్న బీజేపీకి ఆదిలోనే ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయా? ఈ పార్టీ ఊహించిన దానికి.. క్షేత్ర‌స్థాయిలో ఈ పార్టీపై జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌కు మ‌ధ్య ఎక్క‌డా సంబంధం ఉండ‌డం లేదు. ప్ర‌స్తుతం తెలంగాణ బీజేపీ నేత‌ల ఆశ‌లు అధికారంపై ఉంది. మ‌రో మాట‌లో చెప్పాలంటే.. ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌చ్చేయాల‌ని వారు భావిస్తున్నారు. అధికార పార్టీపై దుమ్మురేపే స్థాయిలో బీజేపీ నేత‌లు దూసుకుపోతున్నారు. అయితే.. వీరి ప‌రిస్థితి క్షేత్ర‌స్థాయిలో ఎలా ఉంది? ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? అనే అంశాల‌పై స‌ర్వే చేయిం చుకోవాల‌ని చూస్తున్నారు.

సాధార‌ణంగా ఏ రాజ‌కీయ పార్టీ అయినా.. త‌మ ప‌రిస్థితిపై స‌ర్వే లు చేయించుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణం. ఈ క్ర‌మంలోనే బీజేపీ కూడా క్షేత్ర‌స్థాయిలో పార్టీ ప‌రిస్థితిపైనా.. నేత‌ల ప‌రిస్థితిపైనా.. ప్ర‌జ‌లు ఏమ‌నుకుం టున్నారు? అనే అంశాల‌పై స‌ర్వే చేయించాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే.. ఈ స‌ర్వే చేసేస సంస్థ‌లు ఇత‌ర పార్టీల‌కైతే.. ఓకే అంటున్నాయి కానీ.. బీజేపీకి మాత్రం చేతులు అడ్డంగా ఊపుతున్నాయ‌ట‌. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆర్థిక స‌మ‌స్య‌లే అని తెలుస్తోంది. ఏ సంస్థ అయినా.. స‌ర్వే చేయాలంటే.. క్షేత్ర‌స్థాయిలో త‌న సిబ్బందిని రంగంలోకి దింపాలి.

అదేవిధంగా.. ర‌వాణా, జీత భ‌త్యాలు వంటివి చూసుకోవాలి. దీనికి భారీగానే ఖ‌ర్చు అవుతుంది. ఈ నేప‌థ్యంలో స‌ర్వే చేసే సంస్థ‌లు ముందుగానే డ‌బ్బు గురించి ఆలోచిస్తాయి. ఈ క్ర‌మంలో బీజేపీ నేత‌లు.. ముందుగా డ‌బ్బులు ఇస్తామ‌ని.. ఒప్పందం చేసుకున్నా.. త‌ర్వాత‌.. ఇచ్చే క్ర‌మంలో పీడిస్తున్నార‌నేది స‌ర్వే సంస్థ‌ల ఆవేద‌న‌.

``ముందు స‌ర్వే చేసేందుకు ఒప్పుకున్నా.. త‌ర్వాత‌.. ఆ నిధులు రాబ‌ట్టుకునేందుకు చాలా చాలా క‌ష్ట‌ప‌డాలి. మేం క్షేత్ర‌స్థాయిలో చాలా క‌ష్ట‌ప‌డి రిపోర్టులు ఇస్తున్నాం. అయితే.. రిపోర్టు చేతిలో ప‌డ్డాక బీజేపీ నాయ‌కులు ఏదో ఒక వంక పెడుతున్నారు. ఇది బాగోలేదు.. అది బాగోలేదు.. అంటూ.. వేధిస్తున్నారు. ఈ నెపంతో డ‌బ్బులు ఇవ్వ‌డం లేదు`` అని పెద్ద ఎత్తున‌.. స‌ర్వే సంస్థ‌ల నుంచి ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు.. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో చాలా మంది బీజేపీ పెద్ద నాయ‌కులు స‌ర్వే చేయించుకున్నారు. కానీ, తీరా ఆయా సంస్థ‌ల‌కు డ‌బ్బులు ఇచ్చే విష‌యంలో వారు మొండిచేయి చూపించార‌ట‌.

చాలా మంది నాయ‌కులు స‌ర్వే పూర్త‌య్యాక‌.. అనుకున్న మేర‌కు డ‌బ్బులు ఇవ్వ‌కుండా.. ఏదో సగం స‌గం చేతిలో పెట్టి.. చేతులు దులుపుకొన్నార‌ని..``స‌ర్దు కోవ‌య్యా!`` అంటూ తృణీక‌రించేలా మాట్లాడార‌ని.. పెద్ద ఎత్తున‌ చ‌ర్చ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో చాలా వ‌ర‌కు స‌ర్వే సంస్థ‌లు.. టీఆర్ ఎస్ కి.. కాంగ్రెస్‌కి చేస్తాము కానీ.. బీజేపీ విష‌యంలో మాత్రం స‌ర్వే చేయ‌లేమ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పేస్తున్నార‌ట‌. అధికార పార్టీ టీఆర్ ఎస్ అయినా.. రేవంత్‌రెడ్డి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీ అయినా.. స‌ర్వే సంస్థ‌ల‌కు ఖ‌చ్చితంగా అనుకున్న మేర‌కు డ‌బ్బులు ఇస్తున్నారు.

కానీ, రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేస్తాం.. కేసీఆర్‌ను ఆయ‌న పార్టీని కూల్చేస్తాం.. అని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్న బీజేపీ మాత్రం రూపాయి కూడా బ‌య‌ట‌కు తీయ‌కుండా.. పైగా.. ముందు ఒప్పుకున్న విధంగా.. నిధులు ఇవ్వ‌కుండా.. త‌మ‌ను ఇబ్బంది పెడుతోంద‌ని స‌ర్వే సంస్థ‌లు ఆరోపిస్తుండ‌డం గ‌మనార్హం. దీంతో తాము చాలా న‌ష్ట‌పోయామ‌ని.. అందుకే పెద్ద‌గా బీజేపీ వైపు మొగ్గే ప‌రిస్థి తి కూడా లేద‌ని.. ఈ సంస్థ‌లు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి బీజేపీ నేత‌లు ఎలా ముందుకు సాగుతారో చూడాలి.