Begin typing your search above and press return to search.

బీజేపీకి అమిత ధీమా వెనక... ?

By:  Tupaki Desk   |   16 Nov 2021 4:30 PM GMT
బీజేపీకి అమిత ధీమా వెనక... ?
X
బీజేపీలో ఆశలు మామూలుగా లేవు. అతిగానే అంతా ఉంది. బీజేపీకి ఏపీలో ఏముంది అని ఒక్కసారి విశ్లేషణ చేస్తే జవాబు చాలా చేదుగా ఉంటుంది. అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే లేరు, శాసన మండలిలో ఒకే ఒక్కరు ఉన్నారు. ఇక రీసెంట్ గా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పెర్ఫార్మెన్స్ చేసినది ఏమీ లేదు. అయితే ఈ మధ్య జరిగిన బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఇరవై వేల ఓట్లను కళ్లారా చూసింది. దాంతో బీజేపీలో ఏదో కొత్త ఆశలు చిగురిస్తున్నట్లుగా ఉన్నాయి. పైగా సీఎం ప్రాంతం, జగన్ సొంత జిల్లా కావడంతో అక్కడే తమకు ఇన్నేసి వేల ఓట్లు వస్తే రేపటి రోజున సార్వత్రిక ఎన్నికల నాటికి గట్టిగా నిలబడితే బాగానే సీట్లు లాగేయవచ్చు అన్న అంచనాలు ఏవో పెట్టుకున్నట్లుగా ఉన్నారు. కానీ బద్వేల్ లో కధే వేరు. అక్కడ టీడీపీ పోటీలో లేదు దాంతోనే బీజేపీని ఆ ఓట్లు సాధ్యపడ్డాయి.

ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీ పెద్దాయన అమిత్ షా ఏపీకి వచ్చి చేసిన దిశానిర్దేశం ఏంటి అంటే బీజేపీ సొంతంగా బలపడాలనిట. ఆ పని ఏపీ నేతలే చేసి చూపించాలిట. పైగా బీజేపీ 2024 ఎన్నికల్లో గట్టిగా అధికార పార్టీని ఢీ కొట్టాలంట. ఇతర పార్టీల నుంచి చాలా మంది నేతలను బీజేపీలోకి తేవాలట. అయితే బీజేపీ దగ్గర ఏ రాజకీయ ఆకర్షణ ఉందని ఇతర పార్టీల నుంచి నాయకులు వచ్చి చేరుతారు. కేంద్రంలో ఏడేళ్ల పాలన తరువాత మోడీ క్రేజ్ కూడా నెమ్మదిగా డౌన్ అవుతోంది. వరసగా ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతోంది. బలమైన రాష్ట్రాలు కంచుకోటల్లాంటి సీట్లలో కధ అడ్డం తిరుగుతోంది. అలాంటిది ఏపీలో బీజేపీ ప్రయోగాలు చేస్తే ఓట్లు రాలుతాయా. ఇతర పార్టీల నుంచి నేతలు అంతా వచ్చి కమలం గూటిలోకి చేరిపోతారా.

బీజేపీకి ఏపీ మీద ఏమైనా రాజకీయ ఆశలు ఉంటే చేయాల్సింది ఇది కాదు, ఇతర పార్టీల నేతల మీద ఆశలు పెట్టుకోవడం కాదు, అసలు జనం ఏమనుకుంటున్నారు అన్నది ఆలోచించాలి. జనాలు విభజన హామీల అమలు కోరుతున్నారు. ప్రత్యేక హోదా లాంటివి ఇమ్మంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ని ఎలాంటి కొర్రీలు వేయకుండా సత్వరమే పూర్తి చేయమంటున్నారు. ఇదంతా రాజబాట. దర్జాగా మేము ఏపీకి ఇవి చేశామని చెప్పుకుని రేపటి ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు బీజేపీకి అంది వచ్చిన అవకాశం అది.

కానీ దానిని పక్కన పెట్టి ఏపీలో ఎదిగిపోవాలని బీజేపీ చూడడం తప్పున్నర తప్పు. ఇక ఏపీలో ఈ రోజుకీ రెండు పార్టీలే గట్టిగా ఉన్నాయి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీని దాటుకుని బీజేపీ ముందుకు పోవాలనుకున్నా అసలు కుదిరే వ్యవహారం కాదు, బీజేపీ జనసేన జట్టు కట్టినా ఓట్లు చీలడం తప్ప పెద్దగా ఒనగూడే ప్రయోజనం లేదన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం ఏపీలో వచ్చేది తామే అని అమితంగా ధీమా పడుతోంది. వైసీపీ మీద జనాలకు మొత్తితే వెంటనే చూసేది టీడీపీనే తప్ప బీజేపీని కాదు, బీజేపీకి ఈ రోజున మొత్తానికి మొత్తం 175 సీట్లకు సరిపడా ఎమ్మెల్యే అభ్యర్హ్దులు ఉన్నారా అన్నది కూడా ఇక్కడ ప్రశ్న. ఏది ఏమైనా ఏపీలో బీజేపీ వికసించాలీ అంటే కేంద్రం చేతుల్లోనే అంతా ఉంది. వారే ఏపీకి అన్ని విధాలుగా న్యాయాన్ని చేసి తమ ఘనతగా దాన్ని చెప్పుకోవాలి. అంతే తప్ప లోకల్ లీడర్లు అధికార పార్టీని రెగ్యులర్ గా తిడుతూ ఉంటే జనాలు మెచ్చి ఓట్లేయరు. మరి ఇంత చిన్న లాజిక్ ని మిస్ అవుతున్న కమలనాధులు అన్ని పార్టీల నుంచి నేతలు తమ పార్టీలో చేరిపోతారని భావించడం కంటే వేరే భ్రమలు ఉంటాయా.