Begin typing your search above and press return to search.

బెంగాల్ బీజేపీ నేతల్ని టీ కమలనాథులు స్ఫూర్తిగా తీసుకుంటే కేసీఆర్ కు ఇబ్బందే

By:  Tupaki Desk   |   3 Jun 2022 7:58 AM GMT
బెంగాల్ బీజేపీ నేతల్ని టీ కమలనాథులు స్ఫూర్తిగా తీసుకుంటే కేసీఆర్ కు ఇబ్బందే
X
ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టని తీరు బీజేపీకి ఉంటుంది. తమ తప్పుల్ని ఎత్తి చూపితే చిరాకు పడే కమలనాథులకు.. తమ ప్రత్యర్థులపై మాత్రం చిన్న చిన్న అంశాలపై కూడా చాలా సీరియస్ గా విరుచుకుపడుతుంటారు. తాజాగా అలాంటి తీరు బెంగాల్ బీజేపీ షురూ చేసింది.

బెంగాల్ లోని దీదీ ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు వీలుగా బెంగాల్ కమలనాథులు కొత్త గళాన్ని విప్పారు. పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచాల్సినంతగా పెంచేసిన వేళ.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వ్యతిరేకత.. విమర్శలు వెల్లువెత్తినా కిమ్మనకుండా ఉండిపోయిన కమలనాథులు ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా చెలరేగిపోతున్నారు.

కేంద్రం తన వంతుగా కూసింత సుంకాన్ని తగ్గించుకున్నంతనే రాష్ట్రాలు సైతం తమ వంతుగా తగ్గింపు మొదలు పెట్టాలన్న డిమాండ్ మొదలైంది. ఇందులో భాగంగా బెంగాల్ బీజేపీ నేతలు వాయిస్ పెంచారు.

రాబోయే 15 రోజుల్లో పెట్రోల్.. డీజిల్ ధరలపై పన్నులు తగ్గించాలంటూ మమత సర్కారును అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించకుంటే ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు. కేంద్రం జీఎస్టీ బకాయిల్ని క్లియర్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇంధన ధరలు తగ్గించాలని కోరుతున్నారు.

రాష్ట్రాలు కనీసం లీటరు పెట్రోల్ మీద రూ.5.. డీజిల్ మీద రూ.10 చొప్పున తగ్గించాలంటున్నారు. కేంద్రం ఇప్పటికే రెండుసార్లు ఇందన ధరల్ని తగ్గించిందని.. రాష్ట్రం ఒక్కసారైనా తగ్గించాలంటున్నారు. తాము చేస్తున్న డిమాండ్ కు పదిహేను రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే.. వీధుల్లోకి వచ్చి ఆందోళన బాట పడతామన్నారు.

బెంగాల్ లో బీజేపీ నేతలు షురూ చేసిన ఈ డిమాండ్ ను సమయానుకూలంగా రియాక్టు అవుతూ తెలంగాణ బీజేపీ నేతలు రియాక్టు అయితే.. కేసీఆర్ సర్కారుకు ఇబ్బందే అంటున్నారు. నిత్యం కేంద్రం మీద విరుచుకుపడే పెద్ద సారుకు షాకిస్తూ.. కేంద్రం ధరల్ని తగ్గించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలో ఎందుకు తగ్గించరన్న వాదనకు ప్రజల్లో సానుకూలత ఉంటుందంటున్నారు. మరి.. బెంగాల్ బీజేపీనేతల డిమాండ్ ను తెలంగాణ బీజేపీ నేతలు అందిపుచ్చుకుంటారా? కేసీఆర్ సర్కారును ఇరుకున పడేస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.