Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో ఆపరేషన్‌ కమలం షురూ!

By:  Tupaki Desk   |   14 Dec 2022 11:00 PM IST
ఆ రాష్ట్రంలో ఆపరేషన్‌ కమలం షురూ!
X
ఆపరేషన్‌ కమలం పేరుతో ఆయా రాష్ట్రాల్లో వేరే పార్టీల శాసనసభ్యులను బీజేపీలో చేర్చుకుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడుతోందని బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ పార్టీ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఈశాన్య భారతదేశంలో కీలక రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న మేఘాలయాలోనూ బీజేపీ ఆపరేషన్‌ కమలం చేపట్టడం గమనార్హం.

దేశంలో చిన్న రాష్ట్రాల్లో ఒకటైన మేఘాలయాలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మేఘాలయ అసెంబ్లీలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ)కి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. యునైటెడ్‌ డెమోక్రటిక్‌ పార్టీ (యూడీపీ)కి 8 మంది, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌)కి నలుగురు, హిల్‌ స్టేట్స్‌ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (హెచ్‌ఎస్‌పీడీపీ)కి ఇద్దరు, స్వతంత్రులు ఆరుగురు, బీజేపీ ముగ్గురు సభ్యులు ఉన్నారు. వీరంతా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వం కొనసాగుతోంది. మాజీ లోక్‌ సభ స్పీకర్, మాజీ ముఖ్యమంత్రి పీఏ సంగ్మా కుమారుడు కాన్రాడ్‌ సంగ్మా ప్రస్తుతం మేఘాలయ ముఖ్యమంత్రిగా ఉన్నారు.


ఇక ప్రతిపక్షాల విషయానికొస్తే ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఎన్సీపికి ఒకరు, కేహెచ్‌ఎన్‌ఏఎమ్‌ పార్టీకి ఒకరు ఉన్నారు.


ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేఘాలయ పర్యటనకు వెళ్లారు. ఆయన అక్కడికి వెళ్లిన తొలి రోజే అంటే డిసెంబర్‌ 14న ఆ రాష్ట్రానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కాషాయ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఇందులో బీజేపీ మిత్ర పక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉండడం గమనార్హం.

బీజేపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు స్వతంత్రులు (ఇండిపెండెంట్స్‌) కాగా, ఒకరు టీఎంసీకి చెందిన వారు. మరొకరు అధికార పార్టీ నేషనల్స్‌ పీపుల్స్‌ పార్టీకి చెందినవారు.

బీజేపీ అధికార కూటమిలో ఉన్నప్పటికీ ఆ కూటమిలోని ఎమ్మెల్యేలనే తమ పార్టీలో చేర్చుకోవడం గమనార్హం. వచ్చే ఏడాది మేఘాలయ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సొంతంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ కమలం ప్రారంభించినట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.