Begin typing your search above and press return to search.

జగన్ని దెబ్బ తీసే కుట్ర...హెచ్చరిస్తోంది ఎవరు...?

By:  Tupaki Desk   |   15 Nov 2022 8:09 PM IST
జగన్ని దెబ్బ తీసే కుట్ర...హెచ్చరిస్తోంది ఎవరు...?
X
ఏపీలో పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్న సీఎం జగన్ని దెబ్బ తీయాలని కాషాయదళం పక్కా ప్లాన్ తో ఉందని టీయారెస్ అధినేత. తెలంగాణా సీఎం కేసీయార్ తాజాగా సంచలన కామెంట్స్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. అది ఎక్కడ అంటే తమ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ఈ కీలకమైన కామెంట్స్ చేశారు అని అంటున్నారు. నిజానికి టీయారెస్ శాసనసభా పక్ష సమావేశంలో వైసీపీ గురించి జగన్ గురించి ఎందుకు చర్చ వస్తుంది అన్నది ఆశ్చర్యకరమైన విషయమే.

అయితే కేసీయార్ ఇంతకు ముందు కూడా ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి మరీ తమ ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి బీజేపీ ఏ విధంగా కుట్రలు చేస్తోందో విప్పి చెప్పారు. తమ ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఫాం హౌజ్ పేరిట కొనుగోలు చేయడానికి చేసిన విఫల యత్నం గురించి ఆయన చెబుతూ మండిపడ్డారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు బీజేపీ చూస్తోందని దానికి అధికారం తప్ప మరేమీ పట్టవని ఆయన ఘాటైన పదజాలంతో విమర్శలు చేశారు. ఆనాడు కూడా కేసీయార్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పేర్లను కూడా చెప్పారు. ఢిల్లీ, రాజస్థాన్, ఏపీలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూలదోయడానికి బీజేపీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది అని కూడా వెల్లడించారు.

అయితే దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి కానీ ఏపీ సర్కార్ వైసీపీ నేతలు దానిని లైట్ తీసుకున్నారు. తమకు ఎలాంటి ముప్పు కేంద్రం నుంచి ఉండదని వారు ధీమాగా ఉన్నారు. అయితే ఇటీవల ప్రధాని మోడీ విశాఖ వచ్చిన సందర్భంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ తో భేటీ వేసి మరీ చర్చించడంతో వైసీపీలో కూడా కొంత రాజకీయ అలజడి రేగింది. బీజేపీ చూపు తమ మీద కూడా ఉందా అన్న ఆలోచనలో ఆ పార్టీ పడింది.

ఆ విషయం అలా వేడి మీద ఉండగానే ఇపుడు కేసీయార్ మరోమారు ఏపీలో ప్రభుత్వాన్ని దెబ్బ తీయడానికి బీజేపీ కుట్ర చేస్తోంది అని చెప్పి షాక్ ఇచ్చారు. జగన్ కేంద్రానికి బాగా సహకరిస్తున్నారని, బీజేపీ వారు ఎలా చెబితే అలా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్న ఆయనను ఆయన ప్రభుత్వాన్ని దెబ్బ తీయడానికి బీజేపీ చూస్తోంది అంటే ఎంత దారుణం అని కేసీయార్ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

ఇలా నమ్మిన వారి విషయంలో కూడా బీజేపీ చేస్తోంది అంటే ఇంతకంటే ఘోరం వేరేగా ఉంటుందా అని పార్టీ సమావేశంలో బీజేపీ తీరు మీద మండిపడ్డారని అంటున్నారు. కేసీయార్ ఇలా మాటిమాటికీ ఏపీ సర్కార్ మీద బీజేపీ పెద్దల కన్ను ఉందని కుట్రలు పన్నుతున్నారని చెప్పడం బట్టి చూస్తూంటే ఏదో నిజంగా జరుగుతోందా అన్న చర్చ అయితే వస్తోంది.

ఇక మోడీ గతానికి భిన్నంగా ఈసారి ఏపీకి వచ్చినా వైసీపీ వారితో వ్యవహరించలేదని, సాన్నిహిత్యం ప్రదర్శించడంలేద్ని కూడా ప్రచారంలో ఉన్న మాట. ఆయన టూర్ అధికారికం అయినప్పటికీ అటు బీజేపీ కోర్ కమిటీ మీటింగ్లో పాల్గొని జగన్ కి వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేయమని సూచించారు.

ఇటు జనసేనతో భేటీ అయి రేపటి ఎన్నికల రాజకీయాన్ని వ్యూహాలను చర్చించారు. ఈ విధంగా తాను నమ్మకంగా ఉన్నా బీజేపీ మాత్రం తమ విషయంలో అలా ఉండడంలేదన్న ఆలోచన అయితే ఇపుడిపుడే వైసీపీ నేతలకు కలుగుతోంది అంటున్నారు. ఇపుడు కుట్ర వంటి పెద్ద పదాలను కేసీయార్ వాడడంతో అసలు తెర వెనక ఏం జరుగుతోంది. నిజంగా ఆపరేషన్ ఏపీ అన్న అజెండా బీజేపీ డైరీలో ఉందా అన్న దాని మీదనే అంతా బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.