Begin typing your search above and press return to search.

అసంతృప్తులకు గాలమేయటం మొదలుపెట్టిందా ?

By:  Tupaki Desk   |   23 Nov 2020 4:20 PM IST
అసంతృప్తులకు గాలమేయటం మొదలుపెట్టిందా ?
X
తొందరలోనే జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదపటం మొదలుపెట్టింది. రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుకు అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణుకుమార్ రెడ్డి ద్వారా గాలం వేయటం మొదలుపెట్టారట. ఉపఎన్నికల కోసం విష్ణు ప్రత్యేకంగా తిరుపతిలో క్యాంపు వేశారని సమాచారం. బీజేపీ దృష్ణంతా ముఖ్యంగా తెలుగుదేశంపార్టీలోని అసమ్మతి నేతల మీదే కేంద్రీకృతమైంది. గడచిన ఏడాదిన్నరంగా చాలామంది సీనియర్ టీడీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరి నచ్చక కొందరు వైసీపీలో చేరాలని అనుకున్నా సాధ్యంకాలేదు. ఇదే సమయంలో మరికొందరు టీడీపీకి రాజీనామా చేసినా తర్వాత చంద్రబాబు బుజ్జగింపులతో మెత్తబడ్డారు. అయితే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటువంటి వాళ్ళ జాబితాను దగ్గర పెట్టుకుని బీజేపీ నేతలు సదరు అసంతృప్త నేతలతో టచ్ లోకి వెళుతున్నారని సమాచారం. స్ధానికంగా కమలంపార్టీలోని నేతలతో టీడీపీ అసంతృప్త నేతలతో ముందుగా మాట్లాడించి తర్వాత విష్ణు రంగంలోకి దిగుతున్నారట.

తెలంగాణాలోని దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అనూహ్యంగా గెలిచిన తర్వాత తిరుపతి లోక్ సభ ఉపఎన్నికపై అనివార్యంగా ఒత్తిడి పెరిగిపోతోంది. నిజానికి దుబ్బాకలో గెలిచేంత సీన్ కమలం పార్టీకి లేదు. అయితే టీఆర్ఎస్ ను వ్యతిరేకించే అనేక అంశాలు కలసి రావటం, బీజేపీ నేతలంతా దుబ్బాకలో క్యాంపు వేసి గెలుపుకోసం చెమటలు చిందించటంతో అనూహ్య విజయం సాధ్యమైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దుబ్బాక కు తిరుపతికి మధ్య ఎంత దూరం ఉందో గెలుపుకు బీజేపీ అంతే దూరం ఉంది. అయితే కమలనాదులు మాత్రం విజయం తమదే అంటు రెచ్చిపోతున్నారు.

మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాదరావు చనిపోవటంతో ఉపఎన్నిక అవసరమవుతోంది. ఆ ఎన్నికలో గెలిచిన బల్లికి 2.28 లక్షల ఓట్ల మెజారిటి వస్తే బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. మొత్తం మీద కమలం అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 16వేలు మాత్రమే. అలాంటిది జరగబోయే ఉపఎన్నికలో తమ గెలుపు ఖాయమని వీర్రాజు లాంటి వాళ్ళు చెబితే నమ్మేందుకు ఎవరు సిద్ధంగా లేరు. అయితే వాళ్ళ హడావుడి చూస్తుంటే మాత్రం ముచ్చటేస్తోంది.

సరే చివరకు గెలుస్తారో లేదో తెలీదు కానీ టీడీపీ అసంతృప్త నేతలతో పాటు రాజకీయాలకు సంబంధం లేని ప్రముఖులను కూడా తమ వైపుకు మొగ్గేలా బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గెలుపు ఓటములను పక్కన పెట్టేస్తే ఏ పార్టీ అయినా గెలవటానికే కష్టపడుతుందనటంలో సందేహం లేదు. ఇపుడు కమలంపార్టీ ప్రయత్నాలు కూడా ఇందులో భాగమనే అనుకోవాలి. కాబట్టి బీజేపీకి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.