Begin typing your search above and press return to search.

కేసీఆర్ దగ్గర యాదవ్ పప్పులు ఉడుకుతాయా?

By:  Tupaki Desk   |   17 Nov 2020 2:00 PM IST
కేసీఆర్ దగ్గర యాదవ్ పప్పులు ఉడుకుతాయా?
X
అది 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ముందస్తు ఎన్నికలకు వెళదామనుకొని ప్లాన్ సిద్ధం చేసుకున్న సీఎం కేసీఆర్ ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలతో కాకుండా డిసెంబర్ లోనే ఎన్నికలకు రెడీ అయ్యారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఆరునెలలే ఉండడంతో ముందస్తుకు కేంద్రంలోని బీజేపీ నిర్ణయం కీలకంగా ఉండేది.

అయితే సార్వత్రిక ఎన్నికలతో వెళితే బీజేపీకి నష్టం అని.. అందుకే తెలంగాణలో బీజేపీకి ఎక్కువ సీట్లు రావాలంటే.. తన పార్టీ మద్దతు కూడా కావాలంటే ముందస్తుకు అనుమతి ఇవ్వాలని బీజేపీ పెద్దలను కేసీఆర్ ఒప్పించాడని అప్పట్లో ప్రచారం సాగింది. ముందస్తుకు ఓకే చెబితే సార్వత్రిక ఎన్నికల్లో సీట్లుతగ్గితే మద్దతిస్తానని కేసీఆర్ బీజేపీతో డీల్ కుదుర్చుకున్నాడని టాక్ నడిచింది.

ఎలాగోలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరిపి కేసీఆర్ గెలిచేశారు. అయితే బీజేపీపై అభ్యర్థులను పెట్టనని.. వీక్ కంటెస్టెంట్స్ తో తెలంగాణ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను గెలిచేలా చూస్తానని అప్పట్లో కేసీఆర్ మాట ఇచ్చినట్టు టాక్ నడిచింది. కానీ దాన్ని కూడా తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బ్రేక్ చేసి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్, చింతల రాంచంద్రారెడ్డి లాంటి సీనియర్ బీజేపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఓడించేశాడు. ఓవైపు చెలిమి అంటూనే కేసీఆర్ కొట్టిన దెబ్బను బీజేపీ మరిచిపోలేదు.

సమకాలీన రాజకీయాల్లో కేసీఆర్ ను మించిన రాజకీయ చాణక్యుడు లేడనే ప్రచారం ఉంది. అలాంటి గండరగండరుడు ప్లాన్ చేస్తే ఇక ప్రతిపక్షాలు గల్లంతేనంటారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇప్పుడు జీహెచ్ఎంసీపై నజర్ పెట్టిన కేసీఆర్ దుబ్బాకలో గెలిచిన బీజేపీని చావుదెబ్బ తీయడానికి రెడీ అయ్యారట..

అయితే బీజేపీ ఏం తక్కువ ఏం తినలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్చార్జిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ ను నియమించింది. రాజ్యసభ ఎంపీ అయిన భూపేందర్ కు బీజేపీలోనే మంచి వ్యూహకర్తగా పేరుంది.

బీహార్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంలో.. ఆర్జేడీని కట్టడి చేయడంలో ఈయన వ్యూహాలు పనిచేశాయి. ఈ కారణాలతోనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు బీజేపీ భూపేందర్ ను ఇన్ చార్జిగా నియమించి కేసీఆర్ ఢీకొట్టాలని చూస్తోంది.

అయితే కేసీఆర్ ను కొట్టడం అంత ఈజీ కాదు.. ఎక్కడ ఎప్పుడు ఎలా కర్రుకాచి వాతపెట్టాలో.. ప్రజలను ఆకర్షించాలో కేసీఆర్ బాగా తెలుసు. మరి ఈ బీజేపీ పెద్ద మనిషి కేసీఆర్ వ్యూహాలను ఛేధిస్తాడా? బీజేపీకి విజయం సాధించిపెడుతాడా అన్నది వేచిచూడాలి.