Begin typing your search above and press return to search.

పాదయాత్రలతో గ్రేటర్ కోటను కొల్లగొట్టటమే తాజా ప్లాన్

By:  Tupaki Desk   |   14 Nov 2020 9:45 AM IST
పాదయాత్రలతో గ్రేటర్ కోటను కొల్లగొట్టటమే తాజా ప్లాన్
X
అనూహ్య నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల దిశగా నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోయిన ఒకట్రెండు రోజుల్లో (అయితే ఆదివారం.. లేదంటే సోమవారం) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు జరగాల్సిన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల దిశగా అడుగులు వేయటంతో.. నోటిఫికేషన్ విడుదల లాంఛనమేనన్న మాట వినిపిస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేసిన బీజేపీ.. గ్రేటర్ లోనూ తన సత్తా చాటాలని భావిస్తోంది. దుబ్బాక విజయంతో వచ్చిన మైలేజీ.. ఇటీవల పోటెత్తిన వరదల సందర్భంగా కేసీఆర్ సర్కారు సరిగా వ్యవహరించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ విపక్షంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు గ్రేటర్ లో అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. తమకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా కమలనాథులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పక్కా ప్లాన్ వేయాలే కానీ.. గ్రేటర్ ఎన్నికల్లో తమ మార్కు చూపించే అవకాశం ఉందన్న ఆలోచనలో వారున్నారు. ఇదిలా ఉంటే.. గ్రేటర్ లో తమ సత్తా చాటేందుకు వీలుగా డివిజన్ల వారీగా బీజేపీ అగ్రనేతలంతా పాదయాత్రలు చేయటం ద్వారా.. ఓట్లను తమవైపునకు తిప్పుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

దీనికి సంబంధించిన వ్యూహాన్ని ఖరారు చేయటం కోసం కేంద్ర సహాయమంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. ఎమ్మెల్యే రాజా సింగ్ పాల్గొన్నారు. ఈ నేతలంతా వేర్వేరుగా.. వివిధ డివిజన్లలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. నగరం మొత్తానికి ఒకలాంటి వ్యూహం.. ఆయా డివిజన్లకు మరోలాంటి వ్యూహాన్ని అమలు చేయాలని.. రెండు మేనిఫేస్టోలు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. యువ ఓటర్లను తమవైపునకు తిప్పుకునేలా చేయగలిగితే.. గ్రేటర్ ఫలితాల్లో అద్భుతాలు నమోదయ్యే అవకాశం ఉందన్నఆశాభావం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.