Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై ఈటల అస్త్రాన్ని సంధించేందుకు మోడీషాలు రెఢీ?

By:  Tupaki Desk   |   23 Feb 2022 6:33 AM GMT
కేసీఆర్ పై ఈటల అస్త్రాన్ని సంధించేందుకు మోడీషాలు రెఢీ?
X
తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే ప్రాసెస్ ను దాదాపుగా పూర్తి చేసినట్లుగా ఫీలవుతున్న కేసీఆర్.. తాజాగా జాతీయ రాజకీయాల్ని టార్గెట్ చేయటం తెలిసిందే. భావ సారూప్యం ఉన్న పార్టీలను ఒక చోటుకు తీసుకొచ్చి.. జాతీయ వేదికగా ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టేందుకు వీలుగా మోడీ షాలు కొత్త అస్త్రాన్ని సిద్ధం చేశారని చెబుతున్నారు.

తెలంగాణ ఉద్యమంలోనూ.. టీఆర్ఎస్ పార్టీలోనూ కీలక భూమిక పోషించిన ఈటల.. ఒక దశలో టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత నెంబరు టూ స్థానానికి ఎదిగిన వైనం తెలిసిందే. అనూహ్యంగా కేసీఆర్ తో వచ్చిన విభేదాలు.. రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఈటలను మంత్రి వర్గంలోకి తీసుకోకుండా ఉండాలని భావించినా.. అది సాధ్యం కాకపోవటం.. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖను అప్పజెప్పటం.. అనూహ్యంగా ఆయన్ను పదవి నుంచి తొలగించటం.. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారన్న ఆరోపణలతో చర్యల కత్తిని ఝుళిపించటం తెలిసిందే.

దీంతో.. మనస్తాపానికి గురైన ఆయన తన ఎమ్మెల్యే పదవికి.. టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయటం తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటలను ఓడించటానికి సీఎం కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆయన గెలుపును అడ్డుకోవటం సాధ్యం కాలేదు. ఇటీవల కాలంలో మరే ఉప ఎన్నికకు పెట్టనంత ఖర్చును హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఖర్చు చేశారన్న మాట రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయినప్పటికీ ఈటల విజయం సాధించటం ద్వారా తన సత్తా ఏమిటన్నది చాటారని చెప్పాలి.

ఇదే.. బీజేపీ అధినాయకత్వం కంటిని ఆకర్షించినట్లుగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన ప్రధాని మోడీకి ఈటలను పరిచయం చేసిన క్రమంలోనూ.. ప్రధాని నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు అందరిని ఆకర్షించటంతో పాటు.. అధినాయకత్వం మనసులో ఆయనకున్న స్థానం ఏమిటన్నది అర్థమయ్యేలా చేసింది. బండి సంజయ్ టర్మ్ పూర్తి కావొస్తున్న వేళ.. ఈటలకు టీ బీజేపీ పగ్గాలు అప్పజెబుతారని చెబుతున్నారు.

జాతీయ రాజకీయాల మీద కేసీఆర్ ఫోకస్ పెట్టిన వేళ.. ఆయనకు ఒకప్పుడు అత్యంత సన్నిహిత మితుడైన ఈటలను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే.. రాజకీయం రంజుగా మారటంతో పాటు.. కేసీఆర్ సంధించే ప్రతి ప్రశ్నకు ఈటలే సమాధానాలు చెబితే.. ప్రజలకు చాలా కన్ఫ్యూజన్లు తొలిగే అవకాశం ఉందంటున్నారు.

బండి సంజయ్ దూకుడుగా వ్యవహరిస్తున్నా.. ఆయన నోటి నుంచి వచ్చే కొన్ని మాటలు బీజేపీని ఇబ్బందికి గురి చేస్తోంది. అందుకు భిన్నంగా ఈటల అయితే పరిస్థితుల్లో మార్పు రావటమే కాదు.. కేసీఆర్ కు కాలేలా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈటలకు టీ బీజేపీ అధ్యక్ష పదవి దాదాపు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. ఆసక్తికర రాజకీయ పరిణామాలు తెలంగాణలో కొదవ ఉండదని చెప్పక తప్పదు.