Begin typing your search above and press return to search.

కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై నీళ్లు చ‌ల్లిన మోడీ మ‌నిషి

By:  Tupaki Desk   |   17 May 2022 11:30 PM GMT
కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై నీళ్లు చ‌ల్లిన మోడీ మ‌నిషి
X
ఢిల్లీకి సీఎం కేసీఆర్.. దేశ రాజకీయాలపై ఫోకస్.. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌ల‌తో భేటీ... కాంగ్రెస్ మిత్ర‌ప‌క్ష ప్రాంతీయ పార్టీలు, బీజేపీతో అంట‌కాగుతున్న ఆయా రాష్ట్రాల నేత‌ల‌తో కేసీఆర్ చ‌ర్చ‌లు... ఇక ఢిల్లీలో వేడి పుట్టించ‌డ‌మే ఆల‌స్యం... దాదాపు నెల కింద‌ట ఇలాంటి వార్త‌లు తెలుగు మీడియాలో ఓ రేంజ్‌లో హైలెట్ అయ్యాయి. అడ‌పాద‌డ‌పా తెలంగాణ ముఖ్య‌మంత్రి వివిధ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌డం, ఆయా ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో స‌మావేశాలు, ఢిల్లీలో వివిధ ఆందోళ‌న‌ల‌తో కేసీఆర్ వేడి పుట్టించ‌డం ఖాయ‌మేన‌ని అనుకున్నారు. ఇదే స‌మ‌యంలో బీజేపీకి చెందిన ముఖ్య నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి కూడా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో స‌మావేశం అవ‌డంతో... ఏదో జ‌రుగుతోంద‌నే టాక్ వినిపించింది. అయితే, అదే సుబ్ర‌మ‌ణ్య స్వామి తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు షాకిచ్చార‌ని అంటున్నారు.

దేశ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ ప్ర‌ధానంగా బీజేపీ వ్యతిరేక కూటమికి ఏర్పాట్లు చేస్తున్న స‌మ‌యంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య‌నేత సుబ్రమణ్య స్వామితో స‌మావేశం అయ్యారు. మార్చి నెల‌లో హ‌స్తిన ప‌ర్య‌ట‌న‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లిన స‌మ‌యంలో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ 23 లో ఉన్న కేసీఆర్ నివాసంలో కేసీఆర్ కలిసి జాతీయ రాజకీయ అంశాలు, బీజేపీ విధానాలు, ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు, రైతు ఉద్యమం లో చనిపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వ పరిహారం అంశాలపై చర్చ జరిపిన‌ట్లు సమాచారం. క‌ట్ చేస్తే, తాజాగా హైద‌రాబాద్‌కు వ‌చ్చిన సుబ్ర‌మ‌ణ్య స్వామి కేసీఆర్‌ను క‌ల‌వ‌కుండానే వెళ్లిపోయారు!.

ఇస్కాన్‌ సంస్థ ఆధ్వర్యంలో హైద‌రాబాద్ శ్రీనగర్‌ కాలనీలోని సత్యసాయినిగమాగమంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి డాక్టర్‌ సుబ్రమ‌ణ్యస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగిస్తూ, ప్రపంచంలో హిందూ సంస్కృతి ఎంతో సమున్నతమైనదని, చెక్కు చెదరకుండా ఉన్నది కూడా హిందూ సంస్కృతి మాత్రమేనని అన్నారు. హిందూ బంధువులు హిందూ సంస్కృతిని చాటిచెప్పాల‌ని కోరారు.

కాగా, శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీకి కూత‌వేటు దూరంలోనే ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాస‌మైన ప్ర‌గ‌తి భ‌వ‌న్లో గులాబీ ద‌ళ‌ప‌తి ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న‌తో సుబ్ర‌మ‌ణ్య‌స్వామి మ‌ర్యాద‌పూర్వ‌కంగా కూడా స‌మావేశం కాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గత నెల 29 నుంచి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉన్న కేసీఆర్ సోమ‌వారం నాడే ప్రగతిభవన్‌కు వచ్చారు. ప్రగతిభవన్‌కు రాగానే పార్టీ ముఖ్యనేతలు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేయడంపై స‌మాలోచ‌న‌లు జ‌రిపారు. కాంగ్రెస్, బీజేపీ తమ సభలతో ప్రభుత్వంపై విరుచుకపడుతున్న తరుణంలో కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌కు అండ‌గా ఉంటాడ‌నుకున్న సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి.. .న‌గ‌రానికి వ‌చ్చి ఆయ‌న్ను క‌ల‌వ‌కుండా పోవ‌డం షాకింగ్ నిర్ణ‌య‌మేన‌ని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.