Begin typing your search above and press return to search.

చిదంబరం అంత దారుణమైన పని చేశారా?

By:  Tupaki Desk   |   27 Aug 2019 4:54 AM GMT
చిదంబరం అంత దారుణమైన పని చేశారా?
X
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్య స్వామి. తన వ్యాఖ్యలతో.. సోషల్ మీడియాలో చేసే ట్వీట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఆయన.. తాజాగా తన సొంత రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కమ్ మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై తీవ్ర విమర్శలు.. నమ్మలేని ఆరోపణల్ని భారీగా చేశారు.

యూపీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన చిదంబరం.. ఎవరూ ఊహించలేని రీతిలో దాయాదికి సహకరించారంటూ మండిపడ్డారు సుబ్రమణ్య స్వామి. చిదంబరం దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారత్ కంటే పాకిస్థాన్ కు ఎక్కువ మేలు జరిగిందన్నారు. తాజాగా స్వామి చేసిన ఆరోపణల్లో నిజమెంతో కానీ.. నిజంగా ఇలా చేశారా? ఒకవేళ చేస్తే మాత్రం చిదంబరాన్ని జీవితంలో దేశ ప్రజలు క్షమించలేని రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

అంతేకాదు.. చిదంబరాన్ని ఐఎన్ ఎక్స్ మీడియా స్కాం ఆరోపణల మీద అరెస్ట్ చేస్తే.. పాకిస్థాన్ లో ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయన్న ధర్మసందేహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఇందుకు సంబంధించి స్వామి చెబుతున్న మాటలు కొత్త కలకలానికి తెర తీసేలా ఉన్నాయి. వాస్తవంగా ఏ నేత అయినా అరెస్ట్ అయితే.. వారు స్థానికంగా ఉన్న ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతాయి. కానీ.. అందుకు భిన్నంగా చిదంబరం అరెస్ట్ పై తమిళనాడులో కాకుండా పాకిస్థాన్ లో ఆందోళనలు చోటు చేసుకోవటం ఏమిటని ప్రశ్నించారు.

తాను చేస్తున్న ఆరోపణలపై సుబ్రమణ్య స్వామి వివరణ ఇస్తూ.. 2005లో పాకిస్థాన్ కరెన్సీ ప్రింటింగ్ చేసే కంపెనీకే భారత కరెన్సీ పేపర్ కాంట్రాక్టు ఇచ్చారని.. దీన్ని కట్టబెట్టింది స్వయంగా అప్పటి ఆర్థికమంత్రి చిదంబరమేనన్నారు. దాయాది దేశంపై కాలు దువ్వాలే కానీ.. ఇలా ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపే కరెన్సీ నోట్ల ముద్రణ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ కారణంతోనే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుందన్నారు.

నకిలీ నోట్ల కట్టలు పెరిగాయని.. నకిలీ నోట్ల చలామణి పెరిగినట్లుగా చెప్పారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిందన్నారు. ఓపక్క దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుంటే.. మరోవైపు పాక్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుందన్నారు. 2014లో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నచర్యలతో నకిలీ నోట్ల చెలామణి తగ్గిందని.. 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పాక్ ఆటలకు కళ్లెం వేయగలిగామన్నారు. ఆ తర్వాత పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. పాక్ తో చిదంబరానికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనటానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముందని ప్రశ్నించారు. ఒకవేళ.. చిదంబరం మీద స్వామి చేసిన ఆరోపణలపై ఉన్నతస్థాయి విచారణ జరిపితే బాగుంటుందేమో?