Begin typing your search above and press return to search.

జాగ్ర‌త్త చెప్పి ఆ మ‌హిళా ఎంపీ త‌ప్పు చేశారా?

By:  Tupaki Desk   |   30 Nov 2017 1:25 PM GMT
జాగ్ర‌త్త చెప్పి ఆ మ‌హిళా ఎంపీ త‌ప్పు చేశారా?
X
కొన్ని విష‌యాల మీద మాట్లాడ‌టం నిషిద్దంగా మారుతోంది. రొడ్డు కొట్టుడు ధోర‌ణిలో మాట్లాడాలే కానీ.. ఏ మాత్రం గీత దాటినా వివాదాల్లోకి లాగేయ‌టం ఈ మ‌ధ్య‌న రివాజుగా మారింది. తాజాగా అలాంటి చిత్ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి.. ఎంపీ కిర‌ణ్ ఖేర్‌. ఇంత‌కీ ఆమె చేసిన నేరం ఏమైనా ఉందా? అంటే.. అది ఒక బాధితురాలి విష‌యంలో జాగ్ర‌త్త‌లు చెప్ప‌ట‌మే. ఒక అత్యాచార బాధితురాలి విష‌యంపై స్పందించిన సంద‌ర్భంగా ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న మాట అన‌టం ఇప్పుడు పెద్ద త‌ప్పుగా మారి.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశార‌న్న ముద్ర వేసేస్తున్నారు.

ఇంత‌కీ జ‌రిగిందేమిట‌న్న‌ది చూస్తే..ఛండీగ‌ఢ్ లో ఒక ఆటోడ్రైవ‌ర్‌.. అత‌ని ఫ్రెండ్స్ చేతిలో రేప్ న‌కు గుర‌య్యారు. ఇది స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ దారుణం జ‌రిగిన ప్రాంతం.. ఎంపీగా కిర‌ణ్ ఖేర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్రాంతంలోకి వ‌స్తుంది. ఈ ఉదంతంపై స్పందించిన కిర‌ణ్‌.. ఆటోలో ముగ్గురు యువ‌కులు ఉన్న‌ప్పుడు బాధితురాలు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

అప్ర‌మ‌త్తంగా ఉండి ఆ ఆటోలో ఎక్క‌కుండా ఉండాల్సింద‌ని.. అలాంటి స‌మ‌యాల్లో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. మ‌గ‌పిల్ల‌ల‌ను జాగ్ర‌త్త‌లు చేయ‌టం మాట అటు ఉంచితే.. అమ్మాయిల‌కు త‌గిన సూచ‌న‌లు చేయాల్సి ఉందని.. ఆ బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌ద‌ని చెప్పారు.

తాను ముంబ‌యిలో ఉన్న‌న్ని రోజుల టాక్సీల్లో తిర‌గాల్సి వ‌స్తే.. తాను ప్ర‌యాణం చేసే ట్యాక్సీ నెంబ‌ర్ల‌ను రాసుకునే దానిన‌ని చెప్పారు. ఇలాంటి ఉదంతాల విష‌యంలో మీడియా అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించ‌కుండా సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. కిర‌ణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్య‌ల్ని త‌ప్పు ప‌ట్టారు.

దీంతో ఆమె మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చారు. తాను చేసిన వ్యాఖ్య‌ల్లో ఎలాంటి త‌ప్పు లేద‌న్నారు. తాను చేసిన వ్యాఖ్య‌ల‌ని వెన‌క్కి తీసుకునే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో మ‌హిళ‌ల్ని చైత‌న్య‌వంతం చేయాల్సిన అవ‌స‌రాన్ని చెప్పానే త‌ప్పించి.. బాధితురాలిని కించ‌ప‌రిచే ఉద్దేశం త‌న‌కు లేద‌న్నారు. తన మాట‌ల్ని రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. నిజ‌మే.. జాగ్ర‌త్త‌లు సైతం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లుగా.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లుగా అభివ‌ర్ణించ‌టం ఇప్పుడు ఒక అల‌వాటుగా మారింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.