Begin typing your search above and press return to search.

ఈ బీజేపీ ఎంపీలకు ఏమైంది?

By:  Tupaki Desk   |   27 March 2016 10:40 AM GMT
ఈ బీజేపీ ఎంపీలకు ఏమైంది?
X
అధికారంలో ఉన్నప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. కానీ.. ఈ మర్మాన్ని కమలనాథులు మిస్ అవుతున్నట్లుంది. ఓపక్క ప్రధాని మోడీ ప్రత్యర్థులు సైతం ముచ్చట పడిపోయేలా మాటలు చెబుతూ.. పార్టీని మరిన్ని రాష్ట్రాల్లో విస్తరించేలా ప్రయత్నాలు చేస్తుంటే.. అందుకు భిన్నంగా ఆయన పార్టీ ఎంపీలు మాత్రం ఉన్న పరువును కూడా పోగొట్టేలా వ్యవహరిస్తున్నారు.

ఈ మధ్య తరచూ కొందరు బీజేపీ ఎంపీల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతున్న వేళ.. తాజాగా అలాంటిదే మరొక పరిణామం చోటు చేసుకుంది. గుజరాత్ లోని పోర్ బందర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ విఠల్ ఓ వృద్ధుడిపై దౌర్జన్యం చేస్తున్న వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. నియోజకవర్గంలో జరిగిన ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లో పాల్గొన్న ఆయన..ప్రేక్షకుల చివర్లోకూర్చున్న ఒక వృద్ధుడ్ని అదే పనిగా కొడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

బీజేపీ ఎంపీ వ్యవహారశైలిని విమర్శిస్తూ.. పలువురు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటమే కాదు.. ఇతని వ్యవహారశైలిని నిరసించారు. ఈ వీడియోకాస్తా వైరల్ కావటంతో.. ఇప్పుడీ వీడియో టీవీ ఛానళ్లు ప్రసారం చేయటంతో ఈ ఇష్యూ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎంపీ విఠల్ కు వివాదాలు కొత్తేం కాదు. 2012లోనూ టోల్ బూత్ వద్ద డబ్బులు కట్టమన్న ఉద్యోగిపై తుపాకీ గురి పెట్టిన ఘటన అప్పట్లో బయటకు వచ్చి వివాదాస్పదంగా మారింది. మరి.. తాజా ఇష్యూలో బీజేపీ అధినాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.