Begin typing your search above and press return to search.

బాబుకు ప్ర‌ధాని ఆఫ‌ర్... గుట్టు ర‌ట్టైందే!

By:  Tupaki Desk   |   25 May 2018 12:21 PM GMT
బాబుకు ప్ర‌ధాని ఆఫ‌ర్... గుట్టు ర‌ట్టైందే!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు నోరు తెరిస్తే చాలు సెల్ఫ్ డ‌బ్బా పొంగి పొర‌లుతోందన్న వాదన ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. ఎదుటి వారు ఏమ‌నున‌కుంటార‌న్న విష‌యాన్ని ఏమాత్రం ప‌ట్టించుకోని బాబు... త‌న‌కు సంబంధించిన ఘ‌న‌త‌ల‌ను ఉన్న‌వీ, లేనివీ క‌లిపి కొట్టేస్తున్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ఇంత‌గా లేకున్నా... ఇటీవ‌లి కాలంలో బాబుకు ఈ త‌ర‌హా ప్ర‌సంగాలు బాగానే అల‌వాటైపోయాయి. ప్ర‌తి ప్రసంగంలోనూ త‌న గొప్ప‌త‌నాన్ని చెప్పుకోనిదే... ఆయ‌న మైకును కింద పెట్ట‌డం లేదు. ఈ క్ర‌మంలో ఏకంగా ప్ర‌ధానమంత్రి ప‌ద‌వి కోరి వ‌స్తే... తానే కాద‌న్నాన‌ని ఆయ‌న గొప్ప‌లు పోయారు. అది కూడా ఒక‌సారి కాద‌ని - ఏకంగా పీఎం ప‌ద‌వి త‌న‌ను రెండు సార్లు వ‌రించి వ‌చ్చింద‌ని, అయితే తానే పీఎం ఆఫ‌ర్‌ ను తృణ‌ప్రాయంగా తిర‌స్క‌రించేశాన‌ని కూడా చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

బాబుకు పీఎం ప‌ద‌విని ఇస్తామ‌ని ఎవ‌రు చెప్పారో తెలియ‌దు గానీ... బాబు సెల్ఫ్ డ‌బ్బా ప్ర‌సంగాల్లోని వాస్త‌వ‌మెంంత అన్న విష‌యాన్ని తేల్చిపారేసేందుకు బీజేపీ జాతీయ ప్ర‌ధాని కార్య‌ద‌ర్శి, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు ఇప్పుడు రంగంలోకి దిగిపోయారు. కాసేప‌టి క్రితం మీడియాతో మాట్లాడిన జీవీఎల్‌... బాబు గొప్పల‌పై త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు చంద్ర‌బాబుకు ప్ర‌ధాని ప‌ద‌విని ఆఫ‌ర్ చేసిందెవ‌ర‌ని కూడా జీవీఎల్ కాస్తంత సూటిగానే ప్ర‌శ్నించారు. చంద్రబాబును ప్రధానిని చేస్తామని ఏ ఒక్క నేతా ప్రతిపాదించలేదని కూడా ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. తుమ్మితే ఊడిపోయే పదవి అని అప్పట్లో చంద్ర‌బాబే ప్రధాని పదవికి దూరంగా ఉండిపోయార‌ని, ఆ విష‌యాన్ని దాచేసి ఇప్పుడేమో ప్ర‌ధాని ప‌ద‌విని తాను త్యాగం చేసినట్టు ఫోజులు కొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పగటి కలలు కంటున్నారని జీవీఎల్‌ ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ​ప్రభుత్వ నిధులతో ధర్మపోరాట సభలు పెట్టడం పట్ల జీవీఎల్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర నిధులతో పార్టీ సభలు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తిరుమలను రాజకీయ వ్యవస్థగా మార్చాలని చూస్తున్నారని అన్నారు. అర్చకులను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. అర్చకులను తొలగించినందుకు చంద్రబాబు చెంపలేసుకోవాలని డిమాండ్‌ చేశారు. తిరుమల శ్రీవారి ఆభరణాల మాయంపై విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు ఏమయ్యాయో వెల్లడించాలని జీవీఎల్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంత‌టితో స‌రిపెట్ట‌ని జీవీఎల్‌... చంద్ర‌బాబు ఆస్తుల‌పైనా త‌న‌దైన శైలిలో సెటైర్లు సంధించారు. రెండంటే రెండు ఎక‌రాల భూమి ఉన్న చంద్ర‌బాబు... ఇప్పుడు దేశంలోని అత్యంత సంప‌న్నుడైన సీఎంగా ఎలా అవ‌త‌రించార‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మొత్తంగా చంద్ర‌బాబును టార్గెట్ చేసుకుని జీవీఎల్ చేసిన ప్ర‌స్తుత వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారిపోయాయి.