Begin typing your search above and press return to search.

పోలవరాన్ని కేంద్రానికి ఇచ్చేస్తారా ?

By:  Tupaki Desk   |   6 Jan 2022 4:38 AM GMT
పోలవరాన్ని కేంద్రానికి ఇచ్చేస్తారా ?
X
పోలవరం ప్రాజెక్టు నిర్మించడం చేతకాకపోతే తిరిగి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. జీవీఎల్ చెప్పినట్లు చేస్తే చాలా సమస్యలు పరిష్కారమైపోతాయి. ఎందుకంటే అంతర్రాష్ట్ర సమస్యను కేంద్రమే పరిష్కరించుకుంటుంది. పునరావాసం, నష్టపరిహారం, అంచనా వ్యయాలు పెంచాలని, తగ్గిందనే సమస్యలు కూడా ఉండవు. అంచనా వ్యయం కానీ, వాస్తవ వ్యయం కానీ ఎంతైనా మొత్తం కేంద్రమే భరించాలి కాబట్టి వ్యయాలతో అసలు పనే ఉండదు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కానీ 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు బాధ్యతలను బలవంతంగా తన చేతిలోకి తీసుకున్నారు. అప్పటి నుండే సమస్యలు మొదలయ్యాయి. అసలే రెవిన్యు లోటుతో మొదలైన రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాజెక్టును పూర్తి చేసేంత సీన్ లేదు. కానీ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకున్న దగ్గర నుండి ఆర్ధిక సమస్యలే ఎదురవుతున్నాయి.

ప్రాజెక్టు వ్యయం ఒకలాగుంటే ప్రభుత్వం అంచనా వ్యయాల పేరుతో రెండు మూడు సార్లు అంచనాలను సవరించింది. దీంతో ప్రాజెక్టు వ్యయంలో గందరగోళం మొదలైంది. ఐదేళ్ళ హయాంలో చంద్రబాబు ప్రాజెక్టు నిర్వాసితుల విషయమై శ్రద్ధ పెట్టారు. వారికి పునరావాసం, నష్టపరిహారం చెల్లింపును చాలావరకు పూర్తి చేశారు. ప్రాజెక్టు కూడా 70 శాతానికి పైగా పూర్తి చేసినట్టు వైసీపీ సర్కారే అసెంబ్లీలో చెప్పింది. దాంతో అధికారంలో నుండి దిగిపోయే నాటికి ప్రాజెక్టు వ్యయం తడిసి మోపెడయ్యింది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇంకో ఏడాదికి కానీ ప్రాజెక్టు పూర్తవ్వదు. ఈలోగా ఒడిస్సా ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతోంది. దీన్ని క్లియర్ చేయటం అంత తేలికైన విషయం కాదు. ఇదే విషయమై ఇప్పటికే ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అయితే తాజా పరిస్దితి ఏమిటో తెలీదు. కాబట్టి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి అప్పగించేయటమే తెలివైన నిర్ణయమనే వాదన కూడా మొదలైంది.

ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ప్రిస్టేజిగా తీసుకోకుండా జగన్ కాస్త వాస్తవ దృష్టితో చూస్తే బాగుంటుంది. క్షేత్రస్ధాయిలో ప్రాజెక్టు వ్యయాలకు కేంద్రం అంగీకరించటంలేదు. అవసరం అవుతుందన్న అంచనాలను కేంద్రం ఆమోదించటంలేదు. పోనీ మొత్తం వ్యయాన్ని రాష్ట్రమే పెట్టుకోవాలంటే అంత సీన్ లేదు. ఈ నేపధ్యంలో ప్రాజెక్టును కేంద్రం చేతిలో పెట్టేస్తే ఆ సమస్యలేవో మొత్తం కేంద్రమే పడుతుంది. ప్లాస్ అయినా మైనస్ అయినా మొత్తం కేంద్రానిదే. కాబట్టి జీవీఎల్ చెప్పినట్లే చేస్తే అప్పుడు కేంద్రం సత్తా ఏమిటో కూడా బయటపడుతుంది.