Begin typing your search above and press return to search.

బీజేపీకి అధికారం కంటే అస‌లు సవాల్ ఇదే

By:  Tupaki Desk   |   10 Jun 2017 5:00 AM GMT
బీజేపీకి అధికారం కంటే అస‌లు సవాల్ ఇదే
X
తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌నే ఏకైక ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీకి ఊహించ‌ని స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. పార్టీ నాయ‌కులు ఐక్యంగా సాగి కొత్త నేత‌ల‌ను ఆక‌ర్షించాల్సిన స‌మ‌యంలో సాక్షాత్తు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్య‌క్తే అదిష్టానంపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏకంగా రాష్ట్ర అధ్య‌క్షుడికే లేఖ రాశారు. ఆయ‌నే గోషామహల్‌ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథ్‌! పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె లక్ష్మణ్‌ కు ఘాటు లేఖ రాసిన రాజాసింగ్...``నావల్ల పార్టీకి ఇబ్బంది అనుకుంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయండి. మీ గ్రూపు రాజకీయాల్ని సహించలేకపోతున్నాను. సిట్టింగ్‌ ఎమ్మెల్యేనైన నాకు తెలియ‌కుండా నా నియోజకవర్గంలో పార్టీ పదవుల్ని నా వ్యతిరేకులకు ఎలా కట్టబెడతారు? మీ బండారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా`` అంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై నేరుగా రాజాసింగ్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయినా పార్టీలో తనను ఎవరూ పట్టించుకోవట్లేదంటూ తాజాగా లక్ష్మణ్‌ కు లేఖ రాసి సంచలనం రేకెత్తించారు. దూకుడుగా వ్య‌వ‌హ‌రించే హిందుత్వ నేగా పేరున్న రాజాసింగ్‌ తెలుగుదేశంపార్టీ తరఫున కార్పొరేటర్‌ గా గెలిచిన రాజాసింగ్‌ ఆ తర్వాత బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ కోసం ప్ర‌య‌త్నించ‌గా అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌ రెడ్డి తనకు టిక్కెట్‌ రాకుండా అడ్డుపడుతున్నారంటూ నేరుగా ఆర్‌ ఎస్‌ ఎస్‌ కార్యాలయానికి వెళ్లి హల్‌ చల్‌ సృష్టించి, ఎట్టకేలకు పార్టీ టిక్కెట్‌ సాధించి, గెలిచారు. అప్పటి నుంచి కిషన్‌ రెడ్డితో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ దశలో కిషన్‌ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లు రాష్ట్ర కార్యాలయానికే రానని శపధం కూడా చేశారు. ఆ తర్వాత లక్ష్మణ్‌ పార్టీ అధ్యక్షుడు కాగానే పార్టీ కార్యాలయంలో కాలుపెట్టారు. మొదట్లో లక్ష్మణ్‌ తో సఖ్యతగానే ఉన్న ఆయన ఆ తర్వాత ఆయనపైనా విమర్శలు చేయడం మొదలు పెట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో తనకు తెలియకుండానే పార్టీ కమిటీల్లో తన వ్యతిరేకులకు స్థానం కల్పించారని భగ్గుమన్నారు. ఇదే విషయాన్ని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా మ‌ళ్లీ లేఖ రాసి క‌ల‌క‌లం సృష్టించారు. కాగా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తమదే అధికారం అంటూ స్వీయ ప్రచారం చేసుకుంటున్న బీజేపీకి ఈ అంతర్గత కుమ్ములాట మింగుడుపడట్లేదు. పార్టీ అధికారంలోకి రావ‌డం కంటే ర‌చ్చ చేసే నేత‌ల‌ను దారిలోకి తేవ‌డ‌మే అస‌లు స‌మ‌స్య అని అంటున్నారు.

కాగా, ఇటీవల మంగళ్‌ హాట్‌ లో గుడుంబా కేసులో అరెస్టయిన ఓ వ్యక్తి పోలీస్‌ కస్టడీలో మృతి చెందడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ...ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానంటూ ఓ లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు పంపారు. ఆ మరుసటి రోజే ఆయన తిరిగి అసెంబ్లీలో కనిపించారు. ఇలాంటి ప‌రిణామాల‌ను ప్ర‌స్తావిస్తూ...ఏదో ఒక సంచలనం సృష్టించడమే రాజాసింగ్‌ లక్ష్యంగా కనిపిస్తోందని బీజేపీలోని కొంద‌రు నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/