Begin typing your search above and press return to search.

' తెలంగాణ‌లో ర‌జాకార్ల రాజ్యం... కేసీఆర్ నిజాం రాజు '

By:  Tupaki Desk   |   16 Aug 2019 11:57 AM GMT
 తెలంగాణ‌లో ర‌జాకార్ల రాజ్యం... కేసీఆర్ నిజాం రాజు
X
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు.. టీఆర్ ఎస్ పై తీవ్రంగా ఎప్పటికప్పుడు విరుచుకుపడే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కేసీఆర్ పై విరుచుకు పడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తుంది టీఆర్ ఎస్ ప్రభుత్వం కాదని.. అక్క‌డ నిజాంరాజ్యం నడుస్తోందని ఆరోపించిన రాజా సింగ్.... కేసీఆర్‌ ను ఏకంగా ఎనిమిదవ నిజం రాజుతో పోలుస్తూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కూడా పంద్రాగ‌స్టు వేడుక‌లు కూడా జరుపుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని... ఇలాంటి పరిస్థితి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమనాల‌ని రాజాసింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును పురస్కరించుకుని... దేశ ఔన్నత్యాన్ని చాటే తిరంగా యాత్ర చేపడితే పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు ? సమంజసమని రాజాసింగ్ ప్రభుత్వానికి సూటి ప్ర‌శ్న వేశారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతోందని... అలాంటిది తెలంగాణలో ఇంకా రజాకార్ల తరహా పాలన కనిపిస్తోందని రాజాసింగ్ విరుచుకుపడ్డారు. ఆగస్టు 15 సందర్భంగా దేశం అంతా పంద్రాగస్టు వేడుకలతో వెలుగులు కనపడితే... తెలంగాణలో మాత్రం చీకటి రోజు కనిపించిందని విమ‌ర్శించారు.

ఇక రాజాసింగ్ గ‌త ఐదేళ్ల నుంచి కేసీఆర్‌ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. హిందూమ‌తం, గోసంరక్ష‌ణ ద్వారా కేవ‌లం తెలంగాణ‌లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా హైలెట్ అయిన రాజాసింగ్ ముక్కుసూటి వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో ఉంటుంటారు. పాత‌బ‌స్తీతో ఎంఐఎంతో పాటు ఇటు టీఆర్ ఎస్‌ కు ఆయ‌న పెద్ద కొర‌క‌రాని కొయ్య‌గా మారారు. తాజాగా పాత‌బ‌స్తీతో బీజేపీ కార్య‌క‌ర్త‌లు తిరంగా యాత్ర చేప‌ట్ట‌గా... పోలీసులు దానిని అడ్డుకున్నారు.

ఈ నేప‌థ్యంలోనే రాజాసింగ్ ప్రెస్‌ మీట్ పెట్టి కేసీఆర్ తీరును త‌ప్పుప‌ట్టారు. దేశ ఔన్నత్యాన్ని చాటుతూ మువ్వన్నెల జెండాతో బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌తి యేడాది ఈ తిరంగా యాత్ర చేప‌డ‌తార‌ని.. దానిని ఈ యేడాది పోలీసులు అడ్డుకోవ‌డం స‌రికాద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ‌డ్డారు. ఈ కౌంట‌ర్ నేప‌థ్యంలోనే ఆయ‌న కేసీఆర్‌ ను ఎనిమిదో నిజాం రాజుతో పోల్చారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై టీఆర్ ఎస్ నేత‌లు ఎలా స్పందిస్తారో ? చూడాలి.