Begin typing your search above and press return to search.

మరోసారి తెర మీదకు హరీశ్ పెట్రోల్ డబ్బా.. ఆగిపెట్టె ఎపిసోడ్

By:  Tupaki Desk   |   4 Aug 2021 3:31 AM GMT
మరోసారి తెర మీదకు హరీశ్ పెట్రోల్ డబ్బా.. ఆగిపెట్టె ఎపిసోడ్
X
కాలం తెచ్చే మార్పులు అనూహ్యంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్ని రాజకీయ విమర్శలకు వినియోగించటం సాధ్యమే కాదన్నట్లుగా ఉంటుంది. అలాంటి ఉదంతాలు కాల క్రమంలో పదే పదే ప్రస్తావనకు రావటమే కాదు.. సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది. అంతేకాదు.. ఆ వ్యాఖ్యలు పెద్ద పెద్ద నేతల్ని సైతం డిఫెన్సులో పడేలా చేస్తాయి. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు.

తెలంగాణ ఉద్యమం వేళ.. ఫైర్ బ్రాండ్ హరీశ్ మాట.. నడత పలువురికి స్పూర్తిని రగిలించింది. ఆయన మాటల ప్రభావానికి కొన్ని వేల మంది రోడ్ల మీదకు వచ్చిన పరిస్థితి. అలాంటి హరీశ్ రావు.. ఒక నిండు సభలో తీవ్రమైన భావోద్వేగానికి గురై.. పెట్రోల్ డబ్బాను చూపించి.. తెలంగాణ ఇవ్వని కేంద్రం తీరును తప్పు పడుతూ.. ఆత్మహత్యాయత్నం చేసుకునే ప్రయత్నం చేయటం.. అగ్గిపెట్ట లేకపోవటంతో ఒక దారుణం మిస్ అయ్యిందని చెప్పాలి. ఈ ఉదంతంపై మాట్లాడటానికి కూడా ఎవరూ సాహసించే వారు కాదు. దీంతో.. పెట్రోల్ క్యాన్ వెంట తెచ్చుకున్న పెద్ద మనిషి.. అగ్గిపెట్టెను ఎందుకు మిస్ అయ్యారన్న మాట అప్పట్లోనే వినిపించినా.. పబ్లిక్ గా మాత్రం విమర్శ చేయటానికి సాహసించే వారు కాదు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. హరీశ్ పై ఘాటు విమర్శలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. ఎప్పుడైతే మాజీ మంత్రి ఈటలపై భూకబ్జా ఆరోపణలు మొదలయ్యాయో.. అప్పటి నుంచి హరీశ్ రావు పెట్రోల్ డబ్బా ఎపిసోడ్ తరచూ వార్తల్లో నానుతోంది. ఈ ఉదంతంపై పలువురు ప్రస్తావిస్తూ.. అగ్గి పెట్టె ఎలా మర్చిపోయావ్? అంటూ ఎటకారం చేసుకోవటం ఎక్కువైంది. తనపై వచ్చే రాజకీయ విమర్శలపై విరుచుకుపడే హరీశ్.. పెట్రెల్ డబ్బా.. అగ్గిపెట్ట ఎపిసోడ్ పై మాత్రం వివరణ ఇవ్వకపోవటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. తాజాగా మరోసారి హరీశ్ పెట్రోల్ డబ్బా వ్యవహారం తెర మీదకు వచ్చింది. త్వరలో జరుగుతాయని భావిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి పాదయాత్రతో ప్రచారాన్ని షురూ చేసిన ఈటెల రాజేందర్ అస్వస్థతకు గురి కావటం.. ఆయన్ను హైదరాబాద్ తరలించటం తెలిసిందే. ప్రస్తుతం అపోలోలో చికిత్స పొందుతున్న ఆయనకు ఈ మధ్యనే సర్జరీ చేశారు.

ఈ సందర్భంగా ఈటెల మీద రాజకీయ విమర్శలు జోరందుకున్నాయి. ఉప ఎన్నిక వేళ సానుభూతి పండించేందుకు వీల్ ఛైర్ డ్రామాలు మొదలు పెట్టారని.. సర్జరీ పేరుతో వీల్ ఛైర్ లో కూర్చొని ప్రచారం చేయటం ద్వారా.. హుజూరాబాద్ ఉప ఎన్నికను తనకు అనుకూలంగా మార్చుకోవటానికి వీలుగా ఈ ఎత్తు వేసినట్లుగా గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. వీరిలో మంత్రి హరీశ్ ఒకరు. దీంతో స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. వీల్ ఛైర్ డ్రామాలు ఆడుతున్నారనటం సరికాదన్నారు. అసలుసిసలు డ్రామాలకు పర్యాయపదం కేసీఆర్ ఫ్యామిలీ అని.. సినీ నటులకంటే కూడా గొప్పనటులు కేసీఆర్.. హరీశ్ రావులని మండిపడ్డారు.

ఉద్యమ వేళ.. తనతో తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాతో పాటు అగ్గిపెట్టె తెచ్చుకోవటం ఎందుకు మర్చిపోయినట్లు? అని పర్శ్నించారు. ఆ సందర్భంగా అప్పటి ఫోటోల్ని చూపించిన రఘునందనరావు హరీశ్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై చేసే విమర్శకైనా ఇట్టే స్పందించే హరీశ్.. పెట్రోల్ డబ్బా.. అగ్గిపెట్టె ఉదంతంపై మాత్రం క్లారిటీ ఇవ్వకపోవటం గమనార్హం. ఇప్పటికైనాఈ ఇష్యూ మీద హరీశ్ రావు కాస్త మాట్లాడితే ఆయనకు జరిగే డ్యామేజ్ తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.