Begin typing your search above and press return to search.

టీడీపీ నేత‌ల‌కు బీజేపీ మంత్రి వార్నింగ్‌..

By:  Tupaki Desk   |   11 Jan 2018 1:00 PM IST
టీడీపీ నేత‌ల‌కు బీజేపీ మంత్రి వార్నింగ్‌..
X
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ-బీజేపీ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయి.తాడేపల్లిగూడెం మండలంలోని రామన్నగూడెంలో నిర్వ‌హించిన ‘జన్మభూమి’సభ వేదిక‌గా మిత్ర‌ప‌క్షాల నేత‌లు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ శ్రీనివాస్ వర్గంపై ఏపీ మంత్రి - బీజేపీ నేత మాణిక్యాలరావు మండిపడ్డారు. ఏకంగా తానేంటో నిరూపిస్తానంటూ స‌వాల్ విసిరారు. అందుకు టీడీపీ నేత‌లు సైతం అదే రీతిలో ఘాటుగా స్పందించారు.

కొంత‌కాలంగా బీజేపీకి చెందిన మంత్రి మాణిక్యాలరావును లక్ష్యంగా చేసుకుని మిత్రపక్షానికి చెందిన తెలుగుదేశం నాయకులు - జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దీనిపై సంద‌ర్భానుసారం మంత్రి మాణిక్యాల‌రావు కౌంట‌ర్‌ ఇస్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా జ‌రిగిన స‌భ‌లోఅభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సహకరించడం లేదంటూ జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు వ్యాఖ్యానించారు. అనంత‌రం ఇదే స‌భ‌లో మంత్రి మాణిక్యాల‌రావు మాట్లాడుతూ దీనికి కౌంట‌ర్ ఇచ్చారు.

మంత్రి మాణిక్యాల‌రావు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో నన్నే అంటరానివాడిగా చూసే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. చివరకు - రామన్నగూడెంలో కూడా నాకు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ ఊరులో ఏదైనా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారా? నేను ఏమైనా శత్రువునా? ప్రతి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రిగారి పక్కన కూర్చునే వ్యక్తిని నేను.నేను ప్రశ్నిస్తే చాలా మందికి బాధ కలుగుతోంది. నన్ను నిలదీసే పరిస్థితి వస్తే - ప్రభుత్వాన్ని నిలదీస్తా. నన్ను పక్కకు తప్పించాలని చూస్తే .. ఆంధ్రప్రదేశ్ కు నిధులు రాకుండా కట్ చేస్తాన‌ని చాలా స్పష్టంగా చెబుతున్నా. నేను కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే - పంచాయతీరాజ్‌ విభాగం ద్వారా జిల్లా పరిషత్‌ ఖర్చుపెట్టే పరిస్థితి. సహనానికి కూడా హద్దులుంటాయి. చాలా కాలంగా చూసీ చూడనట్టు పోయా. ఖబడ్దార్‌’అంటూ మాణిక్యాలరావు మండిపడ్డారు.

అయితే ఈ కామెంట్ల‌పై టీడీపీ నేత‌లు సైతం స్పందించారు. మంత్రి వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. మంత్రిగా ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ను కట్ చేస్తా అని వ్యాఖ్యానించడం ఏంట‌ని మున్సిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ అభ్యంతర వ్యాఖ్యల విషయంలో మంత్రి మాణిక్యాలరావు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని’ అని డిమాండ్‌ చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో వివాదానికి మంత్రే కార‌ణ‌మ‌ని తెలిపారు. మంత్రి అందరినీ చులకనగా చూస్తారని, అసలు మర్యాద ఇవ్వరని పేర్కొంటూ ఈ కార‌ణం వ‌ల్లే...విబేధాలు వ‌స్తున్నాయ‌న్నారు. `జెడ్పీ చైర్మన్‌ బాపిరాజు ఇప్పుడు రాజీనామా చేస్తే మేం మళ్లీ గెలిపించుకోగలం. మీకు ఆ ధైర్యం ఉందా?` అని మంత్రికి మున్సిపల్‌ చైర్మన్ స‌వాల్ విసిరారు.