Begin typing your search above and press return to search.

12నెలల్లో 5 రాష్ట్రాల ను కోల్పోయిన బీజేపీ

By:  Tupaki Desk   |   23 Dec 2019 10:05 AM GMT
12నెలల్లో 5 రాష్ట్రాల ను కోల్పోయిన బీజేపీ
X
ఒక్క ఏడాది.. కేవలం 12 నెలల్లో ఐదు రాష్ట్రాల ను కోల్పోయింది బీజేపీ. గత ఏడాది సరిగ్గా డిసెంబర్ లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లలో బీజేపీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ కు అప్పగించింది.

ఇక సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం అఖండ మెజార్టీ సాధించి గద్దెనెక్కింది.  అయితే ఆ తర్వాత మళ్లీ షాక్. ఇటీవల నిర్వహించిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ కి దారుణ పరాభవం.. మహారాష్ట్రలో శివసేన హ్యాండిచ్చి బీజేపీ ని ప్రతి పక్షానికి పరిమితం చేసింది. ఇక చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా హంగ్ వచ్చిన హర్యానా లో కింగ్ మేకర్ అయిన దుష్యంత్ చౌతాలా అండ తో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బతుకు జీవుడా అంటూ బయట పడింది.

ఇప్పుడు జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ చిత్తయ్యింది. జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి బీజేపీ కి మరో రాష్ట్రాన్ని దూరం చేసింది. వరుసగా రెండోసారి గెలస్తామని కలలుగన్న బీజేపీ కి గట్టి షాక్ ఇచ్చారు ఓటర్లు.

ఇక కర్ణాటక లో మాత్రం బీజేపీ నిలబడింది. అక్కడ కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు ను కూల్చి అ నైతికం గా గద్దెనెక్కినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీని ఉప ఎన్నికల్లో ఓటర్లు గెలిపించడం తో తిరిగి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకుంది.

ఇలా కేవలం 12 నెలల్లోనే చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ , రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలను బీజేపీ కోల్పోయింది. కర్ణాటకలో మాత్రమే పూర్తి స్థాయి సొంతంగా అధికారం చేపట్టింది. హర్యానాలో పొత్తుల సంసారం చేస్తోంది. ఇలా అఖండ దేశాన్ని ఏలిన కమలనాథులకు ఇప్పుడు ఒక్కో రాష్ట్రం చేజారుతూ ఉంటే దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోందని చెప్పవచ్చు.