Begin typing your search above and press return to search.

గుడివాడలో గడబిడ.. ఈసారి బీజేపీ నేతల అరెస్ట్

By:  Tupaki Desk   |   25 Jan 2022 1:36 PM GMT
గుడివాడలో గడబిడ.. ఈసారి బీజేపీ నేతల అరెస్ట్
X
మంత్రి కొడాలి నాని టార్గెట్ గా ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇప్పటికే టీడీపీ మంత్రి కొడాలిని టార్గెట్ చేసి ఆయన కళ్యాణ మండపంలో క్యాసినో ఆడించారని నిజనిర్ధారణ కమిటీ వేసి ఎంత రచ్చ చేశారో తెలిసిందే. ఇప్పుడు వంతు బీజేపీకి వచ్చింది. తాజాగా బీజేపీ సైతం ‘సంక్రాంతి సంబరాల’ పేరిట గుడివాడకు బయలు దేరింది. అయితే ఇప్పటికే అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉండడంతో పోలీసులు అడ్డుకున్నారు.

గుడివాడకు 15 కి.మీల దూరంలోనే బీజేపీ నేతలు వెళుతున్న వాహనాలను పోలీసులు అడ్డుకొని అక్కడికి వెళ్లడానికి అనుమతి లేదని తేల్చిచెప్పారు. దీంతో బీజేపీ నేతలు కాలినడకన ముందుకు కదిలారు. సుమారు 3 కి.మీలు పోలీసులతో వాగ్వాదం చేసుకుంటూ బీజేపీ నేతలు వెళ్లారు.

తాము పాకిస్తాన్ కు వెళ్లడం లేదని.. క్యాసినో కోసం చీర్ గర్ల్స్ తో రావడం లేదని.. కేవలం సంక్రాంతి సంబరాలను గుడివాడలో నిర్వహించడానికే వెళుతున్నామని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.

‘సంక్రాంతి సంబరాలు’ ఉత్సవాల ముగింపు పేరుతో విజయవాడ నుంచి గుడివాడకు బీజేపీ బృందం బయలు దేరింది. కొడాలి నాని సంక్రాంతి సంబురాలంటూ క్యాసినో నిర్వహించి చీర్ గర్ల్స్ తో చేశాడని.. తాము మాత్రం ఏపీ సంస్కృతిని మాత్రమే చూపిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బయలు దేరారు.

అయితే మార్గమధ్యలోనే సోము వీర్రాజుతోపాటు ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేసి ఉంగటూరు పీఎస్ కు తరలించారు. ఎంపీ సీఎం రమేశ్, బీజేపీ నేతలు విష్ణులను తోటవల్లూరు పీఎస్ కు తరలించారు.

-గుడివాడలో సంక్రాంతి ముగింపు సంబరాలు జరిపి తీరుతాం: సోము వీర్రాజు
గుడివాడలో సంక్రాంతి ముగింపు సంబరాలు జరిపి తీరుతామని సోము వీర్రాజు అన్నారు. హరిదాసులు, గంగిరెద్దులు, ధర్మం, సంస్కృతిని చూపిస్తామని ప్రకటించారు. సగం వస్త్రాలు కట్టుకున్న చీర్ గర్ల్స్ ను తీసుకురామని.. గడ్డం వ్యక్తుల (కొడాలి నాని) దగ్గర వారు అర్ధనగ్నంగా ఎగురుతున్నారని సోము ఆరోపించారు. ధర్మం అంటే గడ్డాలుపెంచుకోవడం.. చేతులకు తాళ్లు కట్టుకోవడం కాదన్నారు. బట్టలు ఎలా ధరించాలో దేవుడికి కట్టే వస్త్రాలను చూసి నేర్చుకోండని సోము వీర్రాజు వైసీపీ నేతలకు సూచించారు. పొడుగ్గా ఉండే గడ్డం వ్యక్తికి ధర్మం అంటే భయమని.. అందుకే గుడివాడ వస్తున్నామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

ఇప్పటికే గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని.. బీజేపీ నేతలు వెళ్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని పోలీసులు వాదిస్తున్నారు. ఇక గుడివాడకు వెళితే పోలీసులకు వచ్చిన నష్టం ఏంటని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. తాము వెళితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని లెటర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మొత్తం టీడీపీ రగిలించిన క్యాసినో వివాదాన్ని ఏపీ బీజేపీ అందిపుచ్చుకొని రచ్చ చేయడానికి రెడీ అయ్యింది.చూస్తుంటే మంత్రి కొడాలినానిని ఇరుకునపెట్టేందుకు టీడీపీ, బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.మ రి అధికార పార్టీ దీనికి ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది వేచిచూడాలి. బీజేపీ నేతల ఆందోళనపై అటు కొడాలి నాని కానీ.. వైసీపీ నేతలు కానీ ఇంతవరకూ స్పందించలేదు.