Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు సంక్రాంతి గిఫ్టు ఇస్తామంటున్న కమలనాథులు

By:  Tupaki Desk   |   12 Nov 2020 12:20 PM IST
కేసీఆర్ కు సంక్రాంతి గిఫ్టు ఇస్తామంటున్న కమలనాథులు
X
విజయం తీసుకొచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందన్న విషయాన్ని తాజాగా తెలంగాణ బీజేపీ నేతల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణ కమలనాథుల్లో ఎవరూ అంచనా వేయని రీతిలో దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ విజయం సాధించటంతో బీజేపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల కాలంలో తమకు లభించిన అతి పెద్ద విజయంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇలాంటివేళ.. కమలనాథుల నోట మాటలు కోటలు దాటుతున్నాయి.

ఉత్సాహం మంచిదే కానీ.. అది అత్యుత్సాహంగా మారితే మొదటికే మోసం రావటమే కాదు.. ఒక గెలుపుకు మరీ ఇంతలా మిడిసిపడతారా? అన్న భావన ఓటర్లకు కలిగితే.. జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ బాక్సు బద్ధలు కొడతామని.. దీపావళి గిప్టు ఇచ్చిన తాము.. రానున్న రోజుల్లో సంక్రాంతి గిప్టు కూడా ఇస్తామని చెప్పారు. గ్రేటర్ లో కాషాయ జెండా ఎగిరేలా చేస్తామన్న టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. కేసీఆర్ ను టార్గెట్ చేసుకొని పలు వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్ చెప్పినట్లుగా గ్రేటర్ లో బీజేపీ గెలుపు అంత తేలికైన విషయం కాదు. ఇదే విషయాన్ని చెబితే.. కష్టసాధ్యమైన దుబ్బాకను సొంతం చేసుకున్నట్లుగా చెబుతారు. వినేందుకు బాగానే ఉన్నా.. వాస్తవంలో మాత్రం పిక్చర్ మరోలా ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే.. దుబ్బాకలో మాదిరి రఘనందనరావులు గ్రేటర్ లో ఉండరు కదా? ఆ మాటకు వస్తే.. తెలంగాణలోనే రఘునందన రావును పోలిన మైండ్ సెట్ ఉన్న నేతలు బీజేపీలో ఎంతమంది ఉంటారంటే క్వశ్చన్ మార్కే. అలాంటప్పుడు బండి సంజయ్ వ్యక్తం చేసే ధీమా.. ఆయనకు లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ అవుతుందన్న మాట వినిపిస్తోంది. అందుకే.. దుబ్బాక విజయం నుంచి బయటకు వచ్చేసి.. వాస్తవ బలాబలాన్ని బేరీజు వేసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీపావళి గిప్టు ఇచ్చినంత ఈజీ కాదు సంక్రాంతి గిప్టు ఇవ్వటానికి అన్న విషయం బండికి ఎప్పటికి అర్థమవుతుందో?