Begin typing your search above and press return to search.

తెలుగుదేశంతో తెగతెంపులే భాజపా లక్ష్యమా?

By:  Tupaki Desk   |   26 Oct 2015 10:30 PM GMT
తెలుగుదేశంతో తెగతెంపులే భాజపా లక్ష్యమా?
X
కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుందని సామెత. అధికారంలో భాగస్వాములే అయినప్పటికీ.. కడదాకా ఈ బంధం నిలిచి ఉంటుందా లేదా అనే సంగతి.. భారతీయ జనతా పార్టీ నాయకుల తాజా మాటల్లో సంకేతాలను అందిస్తున్నది. ఒకవైపు ఏపీ భాజపా పార్టీకి సంబంధించి జరుగుతున్న అంతర్గత సమావేశాల్లో 2019నాటికి రాష్ట్రంలో పార్టీని స్వతంత్రంగా బరిలోకి దింపాలని.. మొత్తం అన్నిస్థానాల్లో పోటీచేసి.. కాంగ్రెస్‌ పతనం కావడం వలన ఏర్పడిన వాక్యూంను భర్తీ చేయాలని భాజపా భావిస్తున్నది. ఆ పార్టీ స్వతంత్రంగా పోటీచేయాలంటే.. ముందుగా తెదేపాతో ప్రస్తుతం ఉన్న బంధం తెగిపోవాలి కదా...? అవును నిజమే.. ప్రస్తుతం ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు.. తెగతెంపుల కోసమే అన్నట్లుగా ధ్వనిస్తున్నాయి.

ఏదో ఆషామాషీ నాయకులు రోడ్డు పక్కన చంద్రబాబును విమర్శిస్తే ఆ సంగతి వేరు. భాజపాకు చెందిన సీనియర్‌ నాయకుడు, ఆపార్టీ ఎమ్మెల్సీ, పైగా నేడో రేపో ఆ పార్టీకి ఏపీ సారధిగా నియమితులు కాబోతున్నారనే వార్తల్లో చెలామణీ అవుతున్న సోము వీర్రాజు సాక్షాత్తూ చంద్రబాబు సర్కారు మీద ఒంటికాలిపై లేవడం ఆశ్చర్యం కలిగించే అంశం.

నిజానికి చంద్రబాబు సర్కారులో కేబినెట్‌ మంత్రులుగా ఉన్న భాజపా నేతలు కొందరు.. అకేషనల్‌ గా ఆయన వైఖరిని సమర్థిస్తూనే ఉన్నారు. చంద్రబాబు చాలా కష్టపడి పనిచేస్తున్నారంటూ.. అడపాదడపా చెబుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వంతో ప్రత్యక్షంగా ప్రమేయం లేని నేతలు మాత్రం చంద్రబాబు సర్కారును చెండాడేస్తున్నారు. రాయలసీమకు నీటిని అందించే ప్రాజెక్టుల గురించి చంద్రబాబు పట్టించుకోవడం లేదని పురందేశ్వరి అన్నా... అసలు రాష్ట్రంలో పాలన గాడి తప్పుతోందని.. కేంద్రం చేస్తున్న పథకాలు తప్ప.. రాష్ట్ర సర్కారు చేస్తున్నదేమీ లేనేలేదని సోము వీర్రాజు నిప్పులు చెరిగినా ఆ మాటలు దేనికి సంకేతాలో అర్థం చేసుకోవచ్చు.

మొత్తానికి పరిణామాలు చూస్తోంటే.. భాజపా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న మాట నిజం. ఒకవైపు కొందరు చంద్రబాబును కీర్తిస్తారు. మరోవైపు మరికొందరు తూర్పారపట్టేస్తారు. క్రమంగా తెదేపాతో తెగతెంపులే లక్ష్యంగా భాజపా పావులు కదుపుతున్నదని మాత్రం అనుమానాలు కలుగుతున్నాయి.