Begin typing your search above and press return to search.

కన్నడ నటుడ్ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలా?

By:  Tupaki Desk   |   28 Aug 2019 11:43 AM IST
కన్నడ నటుడ్ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలా?
X
హైదరాబాద్ ఇమేజ్ ను కమలనాథులు ఏం చేయాలనుకుంటున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రపంచంలో ఒక గ్లోబల్ విలేజ్ గా మారిన వేళ.. టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు దానంతట అవే వస్తున్న పరిస్థితుల్లో అందుకు భిన్నంగా.. లోకల్ కే అవకాశాలు ఇవ్వాలంటూ వాదనను వినిపించటం ద్వారా కమలనాథులు కొత్త అలజడిని క్రియేట్ చేస్తున్నారని చెప్పాలి.

దేశంలో ఎక్కడా లేని కంపెనీలు.. పరిశ్రమలు మెదక్ జిల్లాలో ఉన్నాయని.. అయితే అక్కడి స్థానికులకు మాత్రం ఉద్యోగాలు లభించటం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు. కన్నడనాట నటుడు ఉపేంద్ర స్థానికులకే ఉద్యోగాలు దక్కాలంటూ చేస్తున్న ఉద్యమాన్ని చూసైనా కేసీఆర్ నేర్చుకోవాలంటున్న వారి మాటలు ఇప్పుడు ఆశ్చర్యానికి కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు.

ఎందుకంటే.. కమలనాథులు చెప్పిందే చేశామనుకుందాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తొలుత సంగారెడ్డి.. ఆ తర్వాత రంగారెడ్డి.. ఆపై హైదరాబాద్ మహానగరం మొత్తం స్థానికులకే ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి.. ఇతర ప్రాంతాల వారికి అవకాశాలు ఇవ్వకూడదంటే పరిస్థితి ఎలా ఉంటుంది? హైదరాబాద్ మహానగరానికి ఉన్న గ్లోబల్ సిటీ ఇమేజ్ ఏమైపోతుందన్న విషయాన్ని కమలనాథులు ఎందుకు మిస్ అవుతున్నారు.

దేశంలోని అతి పెద్ద నగరాలకు లేని బ్యూటీ హైదరాబాద్ సొంతం. దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే.. ఒక్కసారి హైదరాబాద్ వచ్చి పది రోజులు ఉంటే చాలు.. ఈ సిటీ ప్రేమలో పడిపోతారు. ఈ నగరాన్ని వీడేందుకు ఒక పట్టాన ఇష్టపడరు. ఎందుకిలా అంటే.. ఇక్కడి భిన్నత్వంలోని ఏకత్వంతో పాటు.. ఇక్కడి కల్చర్ వారిని కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.

అలాంటి వాతావరణాన్ని మరింత పెరిగి పెద్దయ్యేలా చేసిన కేసీఆర్ లాంటి అధినేత.. లోకల్.. నాన్ లోకల్ అని లొల్లిచేసే కన్నడనటుడ్ని చూసి కాపీ కొట్టాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. ఆ విషయాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చి మాట్లాడుతున్న కమలనాథుల మాటల్ని ఖండించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పక తప్పదు.