Begin typing your search above and press return to search.

‘మంత్రాలయం’ పై బీజేపీ నేతలు మరీ ఇంత అన్యాయమా ?

By:  Tupaki Desk   |   27 Nov 2020 9:15 AM IST
‘మంత్రాలయం’ పై బీజేపీ నేతలు మరీ ఇంత అన్యాయమా ?
X
రాష్ట్రంలో బీజేపీ నేతల వైఖరి మరీ విచిత్రంగా ఉంది. అధికారంలో ఉన్నపుడు ఒకలాగ వ్యవహరించి ప్రతిపక్షంలోకి రాగానే వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అపరిచితుడు సినిమాలోని హీరో క్యారెక్టర్ లాగ తయారయ్యారు చాలామంది నేతలు. ఇందుకు మంత్రాలయం మఠం భూముల వ్యవహారమే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. మంత్రాలయం మఠం భూములను వేలం వేయటానికి ప్రభుత్వం తేదీలను ఫిక్స్ చేయగానే అభ్యంతరాలతో కమలంపార్టీ నేతలు రెచ్చిపోవటమే విచిత్రంగా ఉంది.

అసలు విషయం ఏమిటంటే కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠానికి ఉన్న 208 ఎకరాలను వేలంపాట ద్వారా అమ్మేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకు అమ్మేయాలని అనుకుంటోందంటే ఆక్రమణలు పెరిగిపోతున్నాయట. భూములను కబ్జాలు కాకుండా కాపాడుకోవటం కష్టంగా ఉండటంతో అమ్మేస్తే సరిపోతుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే వేలంపాట ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వెంటనే బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మఠం భూములను అమ్మేయాలని తీసుకున్న నిర్ణయం వైసీపీ ప్రభుత్వానికి కాదు. మఠం భూములను అమ్మేయటానికి మఠం అధికారుల నుండి ప్రభుత్వానికి 2017లోనే ప్రతిపాదనలు వచ్చాయి. మొత్తం భూములపైన ఏడాదికి ఇపుడు వస్తున్న కౌలు రూ. 3 లక్షలే అని అధికారులు చెప్పారు. అదే మొత్తం భూములను అమ్మితే సుమారు రూ. 10 కోట్లు వస్తాయన్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లో వేస్తే ఏడాదికి రూ. 53 లక్షలు వడ్డీ రూపంలో వస్తుందన్నారు.

అధికారుల ప్రతిపాదనకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. మఠం భూములను వేలం ద్వారా అమ్మేసేందుకు 2018 జనవరిలో ప్రభుత్వం అనుమతించింది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబునాయుడే. టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నది బీజేపీ ఎంఎల్ఏ పైడికొండల మాణిక్యాలరావే. స్వయంగా బీజేపీ మంత్రిగా పని చేసిన మాణిక్యాలరావే వేలంపాటకు అనుమతించిన విషయం విష్ణుకు తెలీదా ? అప్పట్లో ప్రభుత్వం అనుమతించినపుడు ఇదే విష్ణు ఏమీ మాట్లాడలేదు.

అలాంటిది అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇపుడు వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటే మాత్రం విష్ణు రెచ్చిపోతుండటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు హయాంలో విజయవాడలో గుళ్ళను కూల్చేసినపుడు కూడా మంత్రిగా పైడికొండలే ఉన్నారు. అప్పట్లో ఏమీ మాట్లాడని ఇదే కమలం నేతలు ఇపుడు దేవాలయాలపై దాడులంటు రెచ్చిపోతుండటం కూడా విచిత్రంగానే ఉంది. అంటే తాము అధికారంలో ఉన్నపుడు ఏమి జరిగినా మాట్లాడని వాళ్ళు ప్రతిపక్షంలోకి రాగానే రెచ్చిపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది.