Begin typing your search above and press return to search.

బీజేపీ వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చిందా?!

By:  Tupaki Desk   |   13 April 2015 5:33 AM GMT
బీజేపీ వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చిందా?!
X
మా వల్లనే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని అనేశారు భారతీయ జనతా పార్టీ నేతలు. ఆ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఒక్కో కమలనాథుడూ ఈ అభిప్రాయాన్ని గట్టిగా వినిపించారు. తమవల్లనే తెలుగుదేశం పార్టీకి అధికారం సిద్ధించిందని వీరు నొక్కివక్కాణించారు. అంతటితో ఆగక ఇప్పుడు తాము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మోస్తున్నామని కూడా వీరు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగుదేశం ప్రభుత్వంపై ఏపీ ప్రజల్లో ప్రబలుతున్న వ్యతిరేకత మనపై కూడా పేరుకొంటోంది.. అని కమలనాథులు తమలో తాము హెచ్చరించుకొన్నారు. ఆ పార్టీ వైపల్యాలకు మనం బాధ్యులమవుతున్నాం.. అయినా కూడా తెలుగుదేశం పార్టీ నేతల వివక్ష కూడా తప్పడం లేదని భారతీయ జనతా పార్టీ నేతలు బాధపడ్డారు.

స్థూలంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రా విభాగం కార్యవర్గ సమావేశంలో తెలుగుదేశం తీరుపై నిరసించే వాళ్లే ఎక్కువగా కనిపించారు. మోడీ మానియా వల్లనే ఏపీలో తెలుగుదేశం పార్టీకి పగ్గాలు చేతికందాయని వారు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూడా తమపైనే ఆధారపడి ఉందని వారు అన్నారు.

అయితే తెలుగుదేశం నేతలు మాత్రం తమకు సరైన ప్రాధాన్యతను ఇవ్వడం లేదని.. వివక్షను చూపుతున్నారని.. ఈ మాత్రం దానికి తెలుగుదేశం వైఫల్యాల్లో ఎందుకు భాగస్వామ్యులు కావాలి.. ఆ పార్టీపై పెరుగుతున్న ప్రజావ్యతిరేకతలో ఎందుకు పాలు పంచుకోవాలి? అంటూ కమలనాథులు ప్రశ్నించారు!

ప్రజల్లోకి వెళదామని.. బలపడదామని.. కమలనాథులు తమకు తాము సూచనలు చేసుకొని.. ధైర్యవచనాలు పలికారు. మరి వీరి ఆవేశం.. ఆవేదన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి!