Begin typing your search above and press return to search.

అంబానీతో భేటీపై పచ్చ దళం అత్యుత్సాహం

By:  Tupaki Desk   |   15 Feb 2018 11:05 PM IST
అంబానీతో భేటీపై పచ్చ దళం అత్యుత్సాహం
X
రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను కలిసి వెళ్లారు. ఈ ఒక్క భేటీ ద్వారా అటు ప్రభుత్వానికి ఇటు నాయకులకు - కుటుంబానికి అన్ని రకాలు గానూ ఎంత మైలేజీ సంపాదించుకోవచ్చుననే విషయంలో పచ్చదళం అత్యుత్సాహానికి పోయినట్లుగా కనిపిస్తోంది. అంబానీ తన సొంత విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటే.. మంత్రి నారా లోకేష్ వెళ్లి ఆయనను రిసీవ్ చేసుకోవడం దగ్గరి నుంచి.. ఈ వ్యవహారాన్ని తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవడానికి తెలుగుదేశం ముచ్చటపడినట్లుగా పలువురు విశ్లేషిస్తున్నారు.

అక్కడినుంచి ఆయనను రియల్ టైం గవర్నెన్స్ కేంద్రానికి తీసుకువచ్చారు. ఈ సాంకేతిక వ్యవస్థ బాగుందని అంబానీ ప్రశంసించగానే.. ఆ అంశానికి విపరీతమైన ప్రచారం కల్పించారు. సాధారణంగా వ్యవస్థ ఎప్పుడూ బాగానే ఉంటుంది. ఇప్పటిదాకా ఆ వ్యవస్థను చూసి బాగాలేదని అన్నవాళ్లు లేరు. కాకపోతే.. వ్యవస్థను ఎలా వినియోగించుకుని.. ఎలాంటి ఫలితాలు సాధించారనేది పురోగతి దిశగా కీలకం అవుతుంది. అయితే అంబానీ దానిని ప్రశంసించగానే.. అంతపెద్ద పారిశ్రామికవేత్త ప్రపంచంలోనే ఎక్కడా ఇలాంటి వ్యవస్థను చూడలేదంటూ కీర్తించడం అపూర్వం అంటూ తెదేపా నేతలు చాటుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత రెండు రోజులుగా అధికారులు - మంత్రులు ఎవ్వరితో ఏ సమావేశం జరిగినా.. అంబానీ పొగడ్తల గురించి ప్రత్యేకంగా వారందరికీ చెప్పుకుంటూ ఉండడం విశేషం.

అదే మాదిరిగా.. తిరుపతిలో ఫోన్ల తయారీ యూనిట్ - విజయవాడలో నాలెడ్జి హబ్ - విశాఖలో మరో కేబుల్స్ పరిశ్రమ ఇలా రిలయన్స్ పరిశ్రమలు వెల్లువెత్తిపోతున్నట్లుగా తెదేపా నాయకులు మీడియాకు చెప్పేసుకున్నారు. నిజానికి ఇవన్నీ ఇంకా ప్రతిపాదనల దశలో ఉన్న వ్యవహారాలు. పెట్టుబడుల దశకు ఇంకా రానేలేదు. ఇలాంటి నేపథ్యంలో ఇంత విస్తృత ప్రచారం జరగడం ఆ సంస్థకే చిరాకు తెప్పించే సంగతి. దానికితోడు.. రిలయన్స్ పెట్టుబడుల ఉత్తుత్తివే అన్నట్లుగా కొన్ని జాతీయ వార్తా పత్రికల్లో కథనాలు వచ్చేయడంతో వారు తలలు పట్టుకున్నారు. తెలుగుదేశం నాయకుల అత్యుత్సాహం వల్ల తమకు ఇబ్బంది వచ్చిందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.