Begin typing your search above and press return to search.

తిరుప‌తిలో బీజేపీ జెండా ఎత్తేసిందా?

By:  Tupaki Desk   |   9 April 2021 10:41 AM GMT
తిరుప‌తిలో బీజేపీ జెండా ఎత్తేసిందా?
X
అత్యంత కీల‌క‌మైన‌.. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో గెలిచి తీరాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న‌ట్టు చెబుతు న్న రాష్ట్ర బీజేపీ నేత‌లకు ఆదిలోనే అనేక అవాంత‌రాలు ఎదుర‌వుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు పొరుగు రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో సేవ‌లందించిన ర‌త్న ప్ర‌భ‌ను ఇక్క‌డ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. ఆమె ముక్కు మొహం పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. అయినా.. కూడా త‌మ హ‌వా చూపించి.. గెలిచి తీరుతామ‌ని నిత్యం మీడియా మీటింగులు పెట్టిమ‌రీ చెబుతున్నారు. అయితే.. ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఈ విష‌యంలో బీజేపీ నేత‌లు చేతులు ఎత్తేసిన‌ట్టేఅంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రో ఐదు రోజుల్లో ప్ర‌చారానికి కూడా తెర‌ప‌డ‌నుంది. ఈ నెల 17న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అంటే.. 15వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే వారికి ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం ఉంది.దీనిని బ‌ట్టి కేవ‌లం ఐదు రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. కానీ, ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌వ‌ర్ చేయాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ నాయ‌కులు కేవ‌లం నెల్లూరును మాత్ర‌మే క‌వ‌ర్ చేశారు. మిగిలిన‌వాటిలో శ్రీకాళ‌హ‌స్తి స‌హా అనేక నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌వ‌ర్ చేయాల్సి వుంది. కానీ,ఈ దిశ‌గా ఎవ‌రూ కూడా క‌ద‌ల‌డం లేదు. అయ్య‌వారు వ‌స్తారు.. ప్ర‌చారం చేస్తారు..అ న్న‌ట్టుగా అంద‌రి చూపూ.. జాతీయ నాయ‌కుల‌పైనే ఉంది.

కానీ, ఇక్క‌డ నుంచి తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయిన టీడీపీ జోరుగా ప్ర‌చారం చేస్తోంది. చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు.. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల‌ను లెక్కేసుకుని.. రోజుకోరకంగా ప‌రుగులు పెడుతున్నారు. ఇక‌, అధికార పార్టీ కూడా ఏకంగా ఏడుగురు మంత్రుల‌ను, 15 మంది ఎమ్మెల్యేల‌ను రంగంలోకి దించింది. పైగా అధికారంలో ఉన్న పార్టీ. దీంతో ప్ర‌చార హోరు.. జోరు పె రుగుతోంది. ఇదిలావుంటే.. ఈ నెల 14న అంటే.. ప్ర‌చారం ముగియ‌డానికి ఒక‌రోజు ముందు .. ఏకంగా జ‌గ‌న్ కూడా రంగంలోకి దిగుతున్నారు.

దీనిని బ‌ట్టి వైసీపీ, టీడీపీల మ‌ధ్య ప్ర‌చార హోరు ఎక్కువ‌గానే ఉంది. కానీ, వీరితో పోల్చుకుంటే మాత్రం బీజేపీ ఎక్క‌డా పోటీ ఇచ్చే ప‌రిస్థితి లేదు. పోనీ.. వీరు చెబుతున్న‌ట్టుగా జాతీయ నాయ‌కుడు జేపీ న‌డ్డా వ‌చ్చినా.. ఆశించిన ఫ‌లితం ద‌క్కేలా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. ఆయ‌న ఇక్క‌డ ఎవ‌రికీ తెలియ‌దు.ఇప్ప‌టికే ఎవ‌రికీ తెలియ‌ని ఫేస్‌ను పోటీలో దింపార‌ని బీజేపీ శ్రేణులు విల‌విల్లాడుతుంటే.. ఇప్పుడు శ్రేణులు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని జేపీ న‌డ్డాను తీసుకువ‌చ్చి ప్ర‌చారం చేస్తే.. ఆయ‌న‌కు పట్టుమ‌ని ప‌ది తెలుగు అక్ష‌రాలు కూడా రాని ప‌రిస్థితిలో ఏమేర‌కు ఓట్లు రాబ‌ట్ట‌గ‌లుతారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

ఏతా వాతా ఎలా చూసినా.. బీజేపీ చేతులు ఎత్తేసిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనిని బ‌ట్టి బీజేపీ వ్యూహాలు.. నాయ‌కులు కూడా పేప‌ర్ పులులేన‌నే కామెంట్లు వ‌స్తున్నాయి. ప‌ది ఓట్లు కూడా వేయించే నాయ‌కులు లేక‌పోవ‌డం.. పోటీలో ఉన్న అభ్య‌ర్థి రాజ‌కీయాల‌కు కొత్త‌కావ‌డంతో బీజేపీ మ‌ళ్లీ నోటాతోనే పోటీ ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.