Begin typing your search above and press return to search.

బీజేపీ నేతకు క్వారంటైన్‌ నోటీసు..కారణం ఏంటంటే?

By:  Tupaki Desk   |   24 April 2020 1:40 PM IST
బీజేపీ నేతకు క్వారంటైన్‌ నోటీసు..కారణం ఏంటంటే?
X
ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా తీసుకుంటున్న చర్యలని మరింత కట్టుదిట్టం చేసింది. ఈ తరుణంలోనే ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.విష్ణువర్ధన్‌ రెడ్డిని హోం క్వారంటైన్‌ చేశారు. అసలు విష్ణువర్ధన్‌ రెడ్డిని ఎందుకు హోం క్వారంటైన్‌ చేశారు అంటే ..ఏపీలో ప్రస్తుతం కర్నూల్ జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఏపీలో అత్యధిక కేసులు ఈ కర్నూల్ జిల్లా నుండే నమోదు అవుతున్నాయి ..ఈ తరుణంలో లాక్ ‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించడం తో పాటు రెడ్‌ జోన్‌ లో ఉన్న కర్నూలు కు వెళ్లి వచ్చిన కారణంగా హోం క్వారంటైన్‌ చేశారు.

ఈ మేరకు బుధవారం అధికారులు ఆయన ఇంటికి నోటీసును అతికించారు. నాలుగు వారాల పాటు గృహ నిర్భంధంలో ఉండాలని అధికారులు నోటీసులో పొందుపరిచారు. కాగా అధికారులు నోటీసులిచ్చేందుకు వెళ్లిన సమయంలో విష్ణువర్ధన్‌ రెడ్డి ఇంట్లో ఉండి కూడా తాను లేనని చెప్పడం తో నోటీసు గోడకు అతికించాల్సి వచ్చిందని కదిరి తహసీల్దార్‌ మారుతి తెలిపారు. నోటీసు ధిక్కరించి ఎక్కడికైనా వెళ్లాలని ప్రయత్నిస్తే ఆయన పై కేసు నమోదు చేస్తామని పట్టణ సీఐ రామకృష్ణ తెలిపారు. అలాగే రెడ్ జోన్ నుండి వచ్చిన కారణంగా అయన కి కూడా కరోనా టెస్టులు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.