Begin typing your search above and press return to search.

ఏపీ గాలిలో బీజేపీ మేడలు!

By:  Tupaki Desk   |   2 Dec 2015 9:18 AM GMT
ఏపీ గాలిలో బీజేపీ మేడలు!
X
ఆంధ్రప్రదేశ్‌ లో భారతీయ జనతా పార్టీ ఇప్పటినుంచే సొంత దారి చూసుకునే పనిలో ఉందా? కేంద్ర పథకాలపై పెత్తనం చేస్తున్న టీడీపీ సర్కారు ఉత్సాహానికి బ్రేకులు వేసేందుకు బీజేపీ రంగంలోకి దిగిందా? కేంద్రపథకాలపై టీడీపీ ముద్ర తొలగించే వ్యూహానికి పదునుపెడుతోందా? రాష్ట్రంలో అమలవుతోన్న పథకాలన్నీ పూర్తిగా కేంద్రానివేనని చాటుకునే ప్రచారానికి తెరలేపనుందా? కొత్తగా మంజూరయిన ఇళ్ల పథకం తమదేనని క్షేత్రస్థాయిలో ప్రచారానికి రంగం సిద్ధం చేసిందా? గత రెండు మూడు రోజుల నుంచి బీజేపీలో జరుగుతున్న పరిణామాలు ఇలాంటి ఆస‌క్తిక‌ర‌ సందేహాలను కలిగిస్తున్నాయి.

ఏపీలో ఎదిగేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న బీజేపీ, అందుకు అన్ని మార్గాలూ అన్వేషిస్తోంది. అందులో భాగంగా టీడీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై దృష్టి సారించి, వాటిని బీజేపీ పథకాలుగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చొరవతో మంజూరయిన 1.93 లక్షల ఇళ్ల పథకంపై పూర్తి పట్టు సాధించాలని భావిస్తోంది. ఇప్పటివరకూ కేంద్రప్రభుత్వ పథకాలను టీడీపీ సర్కారు తనదిగా ప్రచారం చేసుకున్నప్పటికీ తాము మౌనంగా ఉండాల్సి వచ్చిందని, దానివల్ల రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయడం లేదన్న అపవాదు ప్రజల నుంచి ఎదుర్కోవాల్సి వస్తోందని బీజేపీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరంతర విద్యుత్ బీజేపీ ఇస్తుంటే, దానికి సంబంధించిన ప్రచారంపై ఎక్కడా ప్ర‌ధాని మోడీ ఫొటోలు పెట్టడం లేదని మండిపడుతున్నారు. తమ పార్టీ చేసిన కృషి ఫలితంగానే నిరంతర విద్యుత్ పథకం రాష్ట్రానికి ఇస్తే, అది కూడా టీడీపీ తన సొంత పథకంలా ప్రచారం చేసుకోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. తొలుత కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఆ పైలెట్ ప్రాజెక్టును కేటాయిస్తే, వెంకయ్యనాయుడు - నిర్మలాసీతారామన్ వంటి అగ్రనేతలు కేంద్రంపై ఒత్తిడి చేసి, ఏపీని కూడా పైలెట్ ప్రాజెక్టుల జాబితాలో చేర్పించిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ దుబారా తగ్గించేందుకు కేంద్రం ప్రజలకు కారుచౌకగా మంజూరు చేసిన ఎల్ ఇడీ బల్బు పథకాన్ని టీడీపీ తన సొంత పథకంలా రోజూ చంద్రబాబునాయుడు ఎల్ ఇడీ బల్బు పట్టుకున్న ఫొటోలు వేసుకుని ప్రచారం చేసుకుంటోందని తాజాగా విజయవాడలో జరిగిన స‌మావేశంలో బీజేపీ సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అదేవిధంగా మోడీ ప్రధాని అయిన తర్వాత ఏపీకి 20 లక్షల గ్యాస్ సిలిండర్లు కేటాయిస్తే, దానిపైనా టీడీపీ పెత్తనం చేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆ 20 లక్షల్లో బీజేపీ నేతలు సిఫార్సు చేసిన వారికి కాకుండా, టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారికే సిలిండ‌ర్లు దక్కుతుంటే ఇక స్థానికంగా పార్టీ ఎలా బలపడుతుందని నేరుగా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబునే ఓ నాయ‌కుడు నిల‌దీశార‌ట‌. స్వయంగా పార్టీ ఎమ్మెల్సీ - సీనియర్ నేత సోమువీర్రాజు ప్రొద్దుటూరులో హాజరయిన కార్యక్రమంలో పాల్గొన్న వారికి భోజనం పెట్టిన పాపానికి, బీజేపీ కార్యకర్తకు చెందిన రేషన్‌ షాపు డీలర్‌ షిప్‌ ను రద్దు చేస్తే.. ఇక కార్యకర్తల్లో మనో స్థైర్యం ఎలా పెరుగుతుందని ఓ నాయ‌కుడు ప్రశ్నించారు. ఈ నేప‌థ్యంలో కేంద్రం మంజూరు చేసిన ఇళ్ళ పథకానికి విస్తృత‌ ప్రచారం కల్పించాలని బీజేపీ నిర్ణయించింది. హోర్డింగులు, కరపత్రాలు, జిల్లా స్థాయిలో మీడియా సమావేశాల ద్వారా వాటిని ప్రజలకు చేర్చనున్నారు. ప్ర‌ధాని మోడీ - కేంద్ర‌మంత్రులు వెంకయ్యనాయుడు - నిర్మలాసీతారామన్ - ఏపీ అధ్య‌క్షుడు హరిబాబు ఫొటోలు ఉంచడం ద్వారా.. ఆయా ప‌థ‌కాల‌న్నీ పూర్తిగా ప్రధాని మోడీ వ‌ర‌మేన‌నే భావ‌న ప్ర‌జ‌ల్లోకి పంప‌డం త‌ద్వారా పార్టీని బలోపేతం చేయడం ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే ఏపీలో బ‌ల‌ప‌డాల‌నే బీజేపీ ప్ర‌య‌త్నం అత్యాశగా మారుతుందేమోన‌ని ప‌లువురు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌థ‌కాల ఆధారంగా ప్ర‌చారం చేసుకోవ‌డం అంటే గాల్లో మేడ‌లు క‌ట్ట‌డం అవుతుందని బ‌దులుగా ప్ర‌త్యేక హోదా, స్పెష‌ల్ ప్యాకేజీ ద్వారా న్యాయం చేస్తే మంచిద‌ని సూచిస్తున్నారు.