Begin typing your search above and press return to search.

బీజేపీకి అధికారం డౌటేనట..రాంమాధవ్ అనుమానం!

By:  Tupaki Desk   |   6 May 2019 11:11 AM GMT
బీజేపీకి అధికారం డౌటేనట..రాంమాధవ్ అనుమానం!
X
ఈసారి కూడా ప్రధాని పీఠం తమదేనని బీజేపీ నేతలంతా ఢంకా భజాయించి మరీ చెబుతుంటే.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాత్రం డౌటే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బీజేపీకి ఈసారి పూర్తి మెజారిటీ రావడం కష్టంగానే కనిపిస్తోందట. ఒకవేళ అదే జరిగినా ప్రభుత్వాన్ని మాత్రం తామే ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఎన్డీయే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని, మరోమారు దేశాన్ని పాలిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

లోక్ సభలోని మొత్తం 543 సీట్లకు గాను 271 సీట్లు గెలుచుకుంటే ఆ మాజానే వేరన్న రాంమాధవ్- అంత సీన్ లేకుంటే మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. రాంమాధవ్ వ్యాఖ్యలు ఇలా ఉంటే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాత్రం అధికారం తమదేనని, గడిచిన ఐదేళ్లలో ప్రజలకు తాము చూపించింది ట్రైలర్ మాత్రమేనని, అధికారంలోకి వచ్చాక పూర్తి సినిమా చూపిస్తామని అంటున్నారు. ఆయనేమో సినిమా చూపిస్తామంటున్నారు-ఈయనేమో అంత సీన్ లేదంటున్నారు. ఒకే పార్టీ అగ్రనేతల విరుద్ధ ప్రకటనలతో బీజేపీ కార్యకర్తలు కూడా అయోమయంలో పడిపోతున్నారట.

మరోవైపు, రాంమాధవ్ వ్యాఖ్యలపై అధిష్ఠానం గుర్రుగా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఐదో విడత ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయని - మరో రెండు విడతలు జరగాల్సి ఉందని, ఇలాంటి సమయంలో ఈ పిచ్చి మాటలేంటంటూ క్లాస్ పీకారట. ఓడిపోతున్నామని తెలిసినా గెలుస్తున్నామనే చెప్పి కార్యకర్తల్లో ధైర్యం నింపాలి కానీ - ఇలాంటి గాలి తీసే మాటలేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట.