Begin typing your search above and press return to search.

రివర్స్ మంత్ర పేరుతో జగన్ పై మోడీ సన్నిహతుడి పంచ్ లు

By:  Tupaki Desk   |   11 Jun 2020 5:15 AM GMT
రివర్స్ మంత్ర పేరుతో జగన్ పై మోడీ సన్నిహతుడి పంచ్ లు
X
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టాలన్నా.. విమర్శించాలన్నా.. ఆయన ఏడాది పాలనపై ఘాటు విమర్శలు చేయాలన్నా కమలనాథుల్ని ఆపేవారెవరూ లేరు. కానీ.. జగన్ పాలనను తప్పు పట్టాలంటే మోడీ పాలనను పొగిడేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. కేంద్ర పాలన.. రాష్ట్రా పాలన ఒక్కటికాదు. నిజానికి అసలు పోలికే లేదు. ఈ కారణంతోనే..ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు.. బీజేపీ అగ్రనాయకత్వానికి చాలా దగ్గరగా ఉండే రాంమాధవ్ చేసిన తాజా వ్యాఖ్యలు నప్పలేదు సరికదా.. ఆయన స్థాయికి సరిపోని రీతిలో ఉన్నాయని చెప్పక తప్పదు.

తాజాగా బెజవాడలో వర్చువల్ ర్యాలీని నిర్వహించిన ఆయన.. ఏపీలో జగన్ ప్రభుత్వం మాదిరే కేంద్రంలో మోడీ సర్కారు ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. కాకుంటే.. కేంద్రంలో మోడీ సర్కారు రెండో టర్మ్ లో మొదటి ఏడాదిని పూర్తి చేస్తే.. జగన్ సర్కారు తన తొలి పాలనా సంవత్సరాన్ని పూర్తి చేశారన్నది మర్చిపోకూడదు. కేంద్రానికి ఉండే కర్ర పెత్తనం.. రాష్ట్రానికి ఉండదు. కేంద్రం పాలన.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలన ఒక్కటి కాదన్న సింఫుల్ విషయాన్ని రాంమాధవ్ మర్చినట్లుగా కనిపిస్తోంది.

ప్రధాని మోడీ నాయకత్వంలో అవినీతి రహిత పాలన సాగుతుంటే.. ఏపీలో జగన్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నమైన పాలన నిర్వహిస్తున్నట్లుగా పంచ్ లు వేశారు. మోడీది ప్రోగెస్ మంత్ర అయితే.. జగన్ దంతా రివర్స్ మంత్ర అంటూ విమర్శించారు. పుట్టిన రోజున కనిపిస్తే నూరేళ్లు చల్లగా ఉండవయ్యా అంటామని.. అలా అని ఏడాది మొత్తం చేసిన పాపాల్ని మర్చిపోయామని కాదంటూ.. కొత్త తరహా వాదనను వినిపించారు.

రాంమాధవ్ మాటల్నే తీసుకుంటే.. ఏడాదంతా పాపాలు చేసినప్పుడు.. పుట్టిన రోజు నాడు కలవాల్సిన అవసరం ఏముంది? చల్లగా ఉండాలని దీవించాల్సిన అవసరం ఏముంది? మౌనంగా ఉండిపోతే సరిపోతుంది కదా? నచ్చని వాడిని తిట్టొచ్చు.. అలా అని పొగడాల్సిన అవసరం కూడా లేదు. అలా చూస్తుండిపోతే సరి పోతుంది.

ఈ లాజిక్ ను అంత పెద్ద రాంమాధవ్ ఎలా మిస్ అయ్యారన్నది ప్రశ్న. రివర్స్ మంత్ర పేరుతో జగన్ సర్కారు తీరును తప్పు పట్టాలంటే ఆ పనేదో సూటిగా చేసేయాలే కానీ.. మధ్యలో మోడీ మాష్టారిని తీసుకు రావాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. మరీ.. విషయాన్ని రాంమాధవ్ గుర్తిస్తారో లేదో?