Begin typing your search above and press return to search.

గులాబీ కోటలో బాంబ్ బ్లాస్ట్.. సంచలనంగా మారిన బీజేపీ నేత మాట

By:  Tupaki Desk   |   9 Aug 2022 4:57 AM GMT
గులాబీ కోటలో బాంబ్ బ్లాస్ట్.. సంచలనంగా మారిన బీజేపీ నేత మాట
X
తెలంగాణరాష్ట్రంలో అధికార పార్టీకి కేంద్రంలోని మోడీ సర్కారుకు మధ్య నడుస్తున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ చిన్న అవకాశం లభించినా.. వదిలిపెట్టకుండా ఒకరి సంగతి మరొకరు చూడాలన్న స్థాయికి రెండు పార్టీల మధ్య వైరం ముదిరిందని చెప్పాలి. ఇలాంటివేళ తమతో పెట్టుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయాన్ని కేసీఆర్ కు బాగా అర్థమయ్యేలా చూపించాలని బీజేపీ అగ్రనాయకత్వం డిసైడ్ అయిన సంగతి తెలిసిందే.

మిగిలిన పార్టీల మాదిరి తమను టచ్ చేస్తే పరిణామాలు భిన్నంగా ఉంటాయని టీఆర్ఎస్ అధినాయకత్వం ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. తమతో పెట్టుకున్న ఏ పార్టీకి తిప్పలు తప్పలేదని.. అందుకు బీజేపీ మినహాయింపు కాదన్న మాట గులాబీ అధినేత నోటి నుంచి తరచూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. గులాబీ నేతల గుండెల్లో దడ పుట్టే వ్యాఖ్య ఒకటి చేశారు బీజేపీ సీనియర్ నేత.. తెలుగువాడు.. బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న మురళీధర్ రావు.

తాజాగా హైదరాబాద్ వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. త్వరలోనే టీఆర్ఎస్ లో అసమ్మతి బాంబ్ పేలనున్నట్లుగా వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారనున్నాయి. కేంద్రంతో యుద్ధం చేసినంత మాత్రాన టీఆర్ఎస్ లో రానున్న భూకంపం ఆగదని చెప్పారు. కేసీఆర్ సర్కారు తన ఫెయిల్యూర్స్ ను కప్పిపుచ్చుకోవటానికి వీలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా మురళీధర్ రావు వ్యాఖ్యానించారు.

తాజాగా జరుగుతున్న యుద్ధంలో ఓడిపోతామన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారని.. ఈడీ తలుపు తట్టే రోజు దగ్గర్లో ఉందన్న విషయాన్ని పసిగట్టిన కేసీఆర్.. ముందు నుంచే కేంద్రం మీద తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. తాను చేసిన తప్పుల నేపథ్యంలో ఈడీ దాడులు చేస్తే.. ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని.. అందుకే ముందు నుంచి తమ వైఫల్యాల్ని కప్పి పుచ్చుకొని.. బీజేపీ మీద నెపం వేసేందుకు వీలుగా తప్పుడు ప్రచారానికి తెర తీసినట్లుగా ఫైర్ అయ్యారు.

ఇందులో భాగంగానే నీతి ఆయోగ్ నిరర్థకమని చెప్పి.. సమావేశాన్ని బహిష్కరించిన వైనాన్ని గుర్తు చేశారు. గడిచిన కొంతకాలంగా కేంద్రంలోని మోడీ సర్కారు వర్సెస్ టీఆర్ఎస్ సర్కారు అన్నట్లు సాగుతున్న సంగతి తెలిసిందే.

తమపై ఈడీ దాడులు జరగటానికి ఏముందంటూ ఇటీవల కాలంలో తరచూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్ మాటల్ని విన్నప్పుడు జరిగేదేమిటన్నది అర్థమవుతున్న పరిస్థితి. అందుకు తగ్గట్లే రాబోయే రోజులు ఉంటాయన్న దానికి తగ్గట్లే మురళీధర్ రావు మాటలు ఉండటం గమనార్హం.