Begin typing your search above and press return to search.

దత్తన్న చేత చెప్పిస్తే బాగుండు లక్ష్మణ్

By:  Tupaki Desk   |   28 Sep 2016 7:40 AM GMT
దత్తన్న చేత చెప్పిస్తే బాగుండు లక్ష్మణ్
X
తెలంగాణ బీజేపీ నేతల పరిస్థితి కాస్తంత సిత్రంగా ఉంటుంది. ఓపక్క అధికార పార్టీపై విమర్శలు చేస్తూ.. తమ ఐడెంటిటీని కాపాడుకునే ప్రయత్నం చేయటమే కాకుండా.. పట్టు పెంచుకునేందుకు కిందామీదా పడుతున్న పరిస్థితి. వీరి ప్రయత్నం ఇలా ఉంటే.. కేంద్రమంత్రి - తెలంగాణ బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మాత్రం తెలంగాణ అధికారపక్షంపై ప్రశంసలు కురిపించటం.. ఆ పార్టీ నేత‌ల‌ను కీర్తించటం.. తమ పార్టీ నేతలపై తిట్టిపోస్తున్న గులాబీ దళాన్ని పల్లెత్తు మాట అనకపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తాజాగా హైదరాబాద్ లో యుద్ధ ప్రాతిపదికన కూల్చివేస్తున్న అక్రమ కట్టడాల అంశంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రియాక్ట్ అయ్యారు. నగరంలో అక్రమ కట్టడాలకు కారణమైన నేతలు ఇప్పుడు టీఆర్ ఎస్ పార్టీలో చేరానని.. గులాబీ కండువాలు కప్పుకున్న వారు.. గతంలో చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేరని విమర్శించారు.

చెరువులు.. నల్లాలు ఆక్రమించి ఇళ్లు కడుతుంటే.. గ్రామ కార్యదర్శులు అనుమతులు ఇవ్వడంపై రెవెన్యూశాఖ.. హెచ్ ఎండీఏ ఏం చేసినట్లు? అంటూ సూటిగా ప్రశ్నించి లక్ష్మణ్.. గడిచిన రెండేళ్లలో జరిగిన కట్టడాలపై ఏమైనా సమీక్ష జరిపారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. నిజాంపేట గ్రామ కార్యదర్శి కోట్లకు పడగలెత్తారని.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్న లక్ష్మణ్.. మీడియా ముందు మాట్లాడటం తప్పేం కాదు. కానీ.. తమ పార్టీ సీనియర్ నేత దత్తాత్రేయ దృష్టికి ఇలాంటి విషయాలు ఎందుకు తీసుకెళ్లరు? తెలంగాణ సర్కారుకు పెద్దదిక్కు అని ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా తన పార్టీ నేతలతో చెబుతున్న దత్తన్నతో చెప్పి.. ఆయన చేత ఒక ప్రకటన చేయిస్తే బాగుంటుంది కదా? ప్రభుత్వాన్ని తరచూ పొగిడే దత్తన్న లాంటి సీనియర్ల నోటి నుంచి విమర్శ వస్తే ముఖ్యమంత్రి వెంటనే రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా..? లక్ష్మణ్ అండ్ కో ఇలా ఆలోచిస్తే బాగుంటుందేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/