Begin typing your search above and press return to search.

అరే.. ల‌క్ష్మ‌ణ్ భ‌లే ఏసుకున్నారుగా?

By:  Tupaki Desk   |   28 May 2018 9:50 AM GMT
అరే.. ల‌క్ష్మ‌ణ్ భ‌లే ఏసుకున్నారుగా?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తీరు కాసింత చిత్రంగా ఉంటుంది. ఓప‌క్క మిత్ర‌ప‌క్షంగా ఉంటారు. మ‌రోవైపు పుల్ల పెట్టి కెలుకుతుంటారు. ఇంకోవైపు ర‌హ‌స్య స్నేహితుడిగా ఉంటారు. అదే స‌మ‌యంలో.. ఆ మిత్రుడ్ని చిన్న‌బుచ్చుతూ మాట్లాడేస్తుంటారు. కావాల‌ని చేస్తుంటారా? అప్ర‌య‌త్నంగా అలా జ‌రిగిపోతుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఏపీలో టీడీపీతో చెట్టాప‌ట్టాలేసుకొని ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌టంలో అంతో ఇంతో చేయూత‌ను ఇచ్చిన క‌మ‌ల‌నాథులు.. బాబు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టేవారు.

ఏపీకి హోదా అవ‌స‌ర‌మ‌న్న డిమాండ్‌ ను చెవికి ఎక్కించుకోకుండా ఇప్పుడు అధికార‌.. విప‌క్షంతో సున్నం పెట్టుకున్నారు. ఏపీలో బాబు స‌ర్కార్ అవినీతిపై ప్ర‌జ‌లు ఎంత ఆగ్ర‌హంగా ఉన్నారో.. అంతే కోపంగా ఏపీలో బీజేపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపైన ప్ర‌జ‌లు అంతే గుర్రుగా ఉన్నారు.

ఇక‌.. తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. కొన్ని సంద‌ర్భాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు కేసీఆర్ స‌ర్కారు గొప్ప‌గా పొగిడేస్తుంటారు. ప‌బ్లిక్ డ‌యాస్ ల‌లోనూ కేసీఆర్ భ‌జ‌న కార్య‌క్ర‌మాన్ని చేస్తుంటారు. అదే స‌మ‌యంలో కొంద‌రు బీజేపీ పెద్ద‌లు మాత్రం తెలంగాణ స‌ర్కారును తేలిగ్గా తీసిపారేస్తూ విమ‌ర్శ‌లు సంధిస్తుంటారు.

తాజాగా అలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కె ల‌క్ష్మ‌ణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల మీదా.. అధికార‌ప‌క్షాల‌పైనా హాట్ వ్యాఖ్య‌లు చేశారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ల‌క్ష్మ‌ణ్ కేసీఆర్ పై నిప్పులు చెరిగే వేళ‌లో.. ఢిల్లీలో ఇదే కేసీఆర్ ప్ర‌ధాని మోడీతో అపాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ల‌క్ష్మ‌ణ్ కేసీఆర్ స‌ర్కారుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ ఎస్ చెల్ల‌ని రూపాయిగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

కేసీఆర్ పెట్టేది ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కాద‌ని.. ఫ్యామిలీ ఫ్రంట్ న‌డుపుతారంటూ స‌టైర్లు వేశారు. రైతుబంధు ప‌థ‌కం భూస్వామ్య బంధు ప‌థ‌కంగా మారింద‌న్నారు. కేసీఆర్ పై విమ‌ర్శ‌లు సంధించిన ల‌క్ష్మ‌ణ్.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు చెందిన తెలుగుదేశం పార్టీని పేల‌ని తుపాకీగా అభివ‌ర్ణించారు. న‌వ తెలంగాణ నిర్మాణం కోసం బీజేపీ పోరాడుతుంద‌ని.. అవినీతి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ ర‌హిత దేశాన్ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. అంతా బాగుంది కానీ.. అవినీతి గురించి అలాంటి మాట‌లు ఎలా చెబుతారు. ఓ ప‌క్క జాతీయ స్థాయిలో అవినీతి మోడీ హ‌యంలో పెరిగింద‌ని నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్న వేళ‌.. అవినీతి ర‌హితం అంటూ క‌ల చెప్ప‌టం బాగోదు క‌దా ల‌క్ష్మ‌ణ్ జీ!