Begin typing your search above and press return to search.

కాణిపాకం ప్రమాణానికి నేను సిద్ధం ... 'ఎమ్మెల్యే'కి బీజేపీ నేత సవాల్ !

By:  Tupaki Desk   |   2 Aug 2021 10:55 AM GMT
కాణిపాకం ప్రమాణానికి నేను సిద్ధం ... ఎమ్మెల్యేకి బీజేపీ నేత సవాల్ !
X
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణు వర్ధన్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ .. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని, నేను అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి దాన్ని నిరూపించాలని సవాలు విసిరారు. నేను నా రాజకీయ జీవితంలో ఎన్నడూ అవినీతికి పాల్పడలేదు. మీరు తేదీని నిర్ణయిస్తే, నేను కాణిపాకం ఆలయానికి వచ్చి దేవుడి ముందు ప్రమాణం చేస్తాను అని రెడ్డి సవాల్ చేశాడు.

అలాగే , మీరు కూడా కాణిపాకం వచ్చి దేవుడి ముందు నేను అవినీతికి ఏ రోజు కూడా పాల్పడలేదు అని ప్రమాణం చేస్తారా అంటూ శాసనసభ్యుడు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కి సవాల్ విసిరారు. తనపై, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజుపై వ్యక్తిగత ఆరోపణలు చేసినందుకు వైసీపీ నాయకుడిపై బిజెపి నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తాను ఎనిమిది సంవత్సరాలు యువ నాయకుడిగా, మరో 22 సంవత్సరాలు బిజెపి నాయకుడిగా ఎన్నడూ కూడా అవినీతికి పాల్పడలేదని ఆయన అన్నారు.కొంతమంది గొప్ప వ్యక్తుల పేర్లను ఉపయోగించి, నేను డబ్బు మోసం చేశానని మీరు ఆరోపించారు. నేను 1 అవినీతికి కూడా పాల్పడలేదు, అని ఆయన నొక్కిచెప్పారు. తాను హత్య రాజకీయాల్లో పాల్గొనలేదని ,అలాగే హత్యా రాజకీయాలని ఎన్నడూ ప్రోత్సహించలేదని రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో జరిగిన నందం సుబ్బయ్య హత్య కేసు లో సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలని సవాల్ చేశాడు.

ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రశ్నిస్తే బీజేపీ నేతలను కత్తులతో దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తారా? ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు అంటూ బీజేపీ నేత విష్ణువ‌ర్ధన్ రెడ్డి నిల‌దీశారు. ఎమ్మెల్యే గారు మీ అనుచరుడు వైసీపీ నేత రవీంద్రా రెడ్డి, ఇతర నాయకులతో కలసి కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం సిగ్గుచేటు. ఈ సంఘటనలో బీజేపీ కార్యకర్తలు ప్రసాద్, నర్సింహులు, ఇతర కార్యకర్తలను కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపరచారు. ఈ సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను శిక్షించాలి. లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతుంది అని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి, ఈ ఘ‌టనకు కారణమైన ప్రతి ఒక్కరిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాను. నాడు సామాజిక మాధ్యమాల్లో మీకు వ్యతిరేకంగా అవినీతిని ప్రశ్నించాడని మీ ప్రైవేటు గూండాలు ఒకరిని హత్య చేశారు. నేడు మా నేతలు, కార్యకర్తలపైనా దాడి చేశారు. ప్రొద్దుటూరులో ఉండేది భారత రాజ్యాంగమా? లేక ఎమ్మెల్యే రాచమల్లు రాజ్యాంగమా?' అని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు.