Begin typing your search above and press return to search.

ఆప్ ఎంపీకి బీజేపీ గాలమేసిందా ?

By:  Tupaki Desk   |   6 Dec 2021 3:56 AM GMT
ఆప్ ఎంపీకి బీజేపీ గాలమేసిందా ?
X
పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఏకైక ఎంపీ, పంజాబ్ చీఫ్ భగవంత్ మాన్ కు బీజేపీ గాలమేసిందట. ఈ విషయాన్ని భగవంత్ మానే స్వయంగా చెప్పారు.

ఇందులో నిజమెంత ? ఆయన చేసిన సంచలనమైన ఆరోపణలకు ఆధారాలేమిటి ? అనే విషయాలపై ఇపుడు ఆసక్తి పెరిగింది. అయితే ఆధారాలన్నింటినీ తగిన సమయంలో వెల్లడిస్తామని మాన్ చెప్పారు. ఇంతకీ ఎంపీ చెప్పిందాని ప్రకారం బీజేపీలోని ఒక సీనియర్ నేత ఫోన్ చేశారట.

ఆప్ ను వదిలేసి బీజేపీలోకి వచ్చేస్తే భారీగా డబ్బు ఇస్తామని ఆశ పెట్టారట. అలాగే కేంద్ర మంత్రివర్గంలో చోటు కూడా ఆఫర్ చేసినట్లు ఎంపీ చెప్పారు. తాను కోరుకున్న శాఖను అప్పగిస్తామని సదరు సీనియర్ నేత తనను ప్రలోభాలకు గురిచేసినట్లు చెప్పారు.

నాలుగు రోజుల క్రిందట తనకు ఫోన్ చేసిన సదరు సీనియర్ నేత బీజేపీలోకి రావటానికి ఎంత తీసుకుంటారని డైరెక్టుగానే అడిగినట్లు చెప్పారు. తనకే కాదని తమ పార్టీ ఎంఎల్ఏలకు కూడా బీజేపీ గాలమేస్తోందని ఎంపీ చెప్పిన విషయం పంజాబ్ లో సంచలనంగా మారింది.

పంజాబ్ లో ఆప్ తరపున ఎన్నికైన ఏకైక ఎంపీని తానే కాబట్టి బీజేపీలోకి ఫిరాయించిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని బీజేపీ సీనియర్ నేత భరోసా ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఆ ఆఫర్ ను భగవంత్ తిరస్కరించారట.

ఎంపీ చేసిన ఆరోపణలు పంజాబ్ లో ఎందుకు సంచలనం సృష్టిస్తోంది ? ఎందుకంటే రెండు కారణాల వల్ల. మొదటిదేమో తొందరలోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం. రెండో కారణమేమో బీజేపీకి ఉన్న ట్రాక్ రికార్డు అలాంటిదే కావటం.

బీజేపీ ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే పార్టీ ఫిరాయింపులను యధేచ్చగా ప్రోత్సహిస్తోంది. కర్నాటక, గోవా, మణిపూర్, సిఖ్ఖిం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందంటే అది కేవలం పార్టీ ఫిరాయింపుల కారణంగానే. ఎక్కడికక్కడ ప్రత్యర్ధి పార్టీల్లోని ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి తన పార్టీలోకి లాగేసుకుంటోంది.

కాబట్టి పంజాబ్ లోని ఆప్ ఎంపీ విషయంలో కూడా ప్రయత్నాలు జరిగిందంటే ఎవరు కొట్టిపారేయటం లేదు. కాకపోతే మరీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆపని చేయటానికి ప్రయత్నించటమే ఆశ్చర్యంగా ఉంది.

పశ్చిమబెంగాల్లో కూడా 27 మంది తృణమూల్ ఎంఎల్ఏ లను బీజేపీ లాగేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి రావటానికి ఎంతస్ధాయికైనా బీజేపీ దిగజారిపోతుందనే విషయాన్ని పై రాష్ట్రాల్లోని ఘటనలు నిరూపిస్తున్నాయి.

అందుకనే ఇపుడు భగవంత్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. పంజాబ్ లో అధికారంలోకి వచ్చేంత సీన్ బీజేపీకి లేదు. అయితే అధికారంలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఫిరాయింపులను ప్రోత్సహించటం.