Begin typing your search above and press return to search.

భారత్ ప్రతీకారానికి సిద్ధం కావాల్సిందే..బీజేపీ ఎంపీ

By:  Tupaki Desk   |   3 Sept 2020 4:00 PM IST
భారత్ ప్రతీకారానికి సిద్ధం కావాల్సిందే..బీజేపీ ఎంపీ
X
గత కొద్దిరోజులుగా భారత్ చైనా సంబంధాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. చైనా వక్ర బుద్ధి కొంచెం కొంచెంగా బయటపడుతుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం చైనాపై డిజిటల్ స్ట్రైక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ బుద్ధి తెచ్చుకొని చైనా తమ బుద్ధి ఇంతే అన్నట్టుగా ప్రవర్తిస్తూ భారత్ కయ్యానికి కాలు దువ్వుతుంది. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద తాజాగా భారత్, చైనా సైనికుల మధ్య తాజాగా చోటు చేసుకున్న ఘర్షణ, చైనా మరోసారి భారీ ఎత్తున తన సైనికులు, యుద్ధ సామాగ్రి, సుఖోయ్ యుద్ధ విమానాలను సరిహద్దుల్లో మోహరింపజేస్తోందా.. అనే ప్రశ్నలకు అవుననే సమాధానం ఇచ్చారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి.

చైనా యుద్ధానికి సన్నద్ధమౌతోందని, ఈ సమయంలో భారత్ యుద్ధానికి సిద్ధం కావాల్సిందే అని స్పష్టం చేశారు. యుద్ధ సంకేతాలను చైనా పంపించినట్టయిందని అన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పంగ్యాంగ్ త్సొ లేక్ వద్ద కిందటి నెల 29, 30 తేదీల్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నిచంగా.. భారత జవాన్లు వారిని దీటుగా అడ్డుకున్నారు. వారిని భారత భూభాగంపైకి రాకుండా నియంత్రించారు.

ఈ క్రమంలో వారి మధ్య తోపులాట చోటు చేసుకుందని, ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఈ పరిణామాలతో కేంద్ర అప్రమత్తమైంది. హస్తినలో శరవేగంగా కీలక పరిణామాలు ఒకదాని వెంట ఒకటి చోటు చేసుకుంటూ వచ్చాయి. లఢక్ లెప్టినెంట్ గవర్నర్ రాకేష్ కుమార్ మాథుర్.. కేంద్ర రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలతో సమావేశం అయ్యారు. ఆ మరుసటి రోజే భారత్, చైనా ఆర్మీ అధికారుల మధ్య మరో దఫా చర్చలు ప్రారంభం అయ్యాయి. రెండు రోజుల పాటు కొనసాగాయి. అయితే ఈ చర్చలు పెద్దగా ఆశాజనకంగా లేవని అధికారులు వెల్లడిస్తున్నారు. అదే సమయంలో ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె..లఢక్ పర్యటన చేపట్టారు. ప్రస్తుతం ఆయన లేహ్‌లో పర్యటిస్తున్నారు. సరిహద్దు భద్రతపై క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం న్యూఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లిన ఆయన నేరుగా లేహ్ బేస్ క్యాంపును చేరుకున్నారు. రెండురోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. ఏదేమైనా చైనా దూకుడు చూస్తుంటే.. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపుతున్నట్లు కనిపిస్తుంది.