Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కు కమలనాథులు గాలం వేశారా?

By:  Tupaki Desk   |   14 Nov 2020 11:00 PM IST
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కు కమలనాథులు గాలం వేశారా?
X
ఒక విజయం తీసుకొచ్చిన ఆత్మవిశ్వాసం.. స్థైర్యం తెలంగాణ బీజేపీలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడ్డాలో కాషాయ జెండా పాతిన వైనం బీజేపీ వర్గాల్ని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం తమకు లభించిన అధిక్యతను ఎట్టి పరిస్థితుల్లో వదుకోకూడదన్న పట్టుదలతో ఆ పార్టీ ఉంది. ఇందుకు తగ్గట్లు పలు వ్యూహాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు.

త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో 70 స్థానాల్ని తమ ఖాతాలో వేసుకోగలిగితే.. తెలంగాణ అధికార పక్షానికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వటమే కాదు.. టీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ మొదలైందన్న సంకేతాల్ని ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఈ కష్టతరమైన టాస్కును చేధించటానికి తమ ముందున్న అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు పలువురిని పార్టీలో చేర్చుకునేందుకు వీలుగా గాలం వేసినట్లుగా తెలుస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనం కావటం.. కేంద్రంలో బీజేపీ సర్కారు ఉన్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి తమకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకునే వీలుంటుందని భావిస్తున్నారు. కేసీఆర్ కు చెక్ పెట్టాలంటే బీజేపీకి మించింది మరొకటి లేదన్న అభిప్రాయానికి బలం అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటివేళ.. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు భారీ గాలాన్ని సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.

ఇప్పుడున్నపరిస్థితుల్లో రేవంత్ కు ఉన్న అవసరాలు బీజేపీ అధినాయకత్వానికి తెలియంది కాదు. అందుకే.. అతన్ని పార్టీలోకి వచ్చేలా చేస్తే.. పలువురు కాంగ్రెస్ నేతలు కమలం గూటికి వచ్చేందుకు క్యూ కట్టే వీలుందని చెబుతున్నారు. అందుకే.. రేవంత్ ను పార్టీలోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ ప్రచారంపై రేవంత్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.