Begin typing your search above and press return to search.

బీజేపీ.. ఈ దొడ్డిదారి అధికారంతో సాధించేది ఏమిటి?

By:  Tupaki Desk   |   10 March 2020 9:45 AM GMT
బీజేపీ.. ఈ దొడ్డిదారి అధికారంతో సాధించేది ఏమిటి?
X
దేశ ప్ర‌జ‌లు భార‌తీయ జ‌న‌తా పార్టీకి కావాల్సిన‌న్ని సీట్లు ఇచ్చారు. 2014 ఎన్నిక‌ల్లోనూ బీజేపీ కి ప్ర‌జ‌లు సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి త‌గినంత మెజారిటీని ఇచ్చారు. ఇక 2019లో అయితే అంత‌కు మించి సీట్ల‌ను ఇచ్చారు. ఇలా మోడీని ఒక సూప‌ర్ ప‌వ‌ర్ గా మార్చారు దేశ ప్ర‌జ‌లు. దేశ చ‌రిత్ర‌లో గ‌త కొన్ని ద‌శాబ్దాల్లో ఏ పార్టీకి ప‌వ‌ర్ ఇచ్చినా ప్ర‌జ‌లు సంకీర్ణ ప్ర‌భుత్వాల‌కే కార‌ణ‌మ‌య్యారు. అయితే మోడీని మాత్రం సూప‌ర్ ప‌వ‌ర్ గా మార్చారు.

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే.. ప్ర‌జ‌ల తీర్పు మారింది. భార‌తీయ జ‌న‌తా పార్టీని వివిధ రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. కాంగ్రెస్ కో మ‌రో ప్రాంతీయ పార్టీకో ప్ర‌జ‌లు అవ‌కాశం ఇస్తూ వ‌స్తున్నారు. అలా బీజేపీ తిర‌స్క‌రించ‌బ‌డిన రాష్ట్రాల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఒక‌టి. లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల క‌న్నా ముందే.. బీజేపీని మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. స్వ‌ల్ప‌మైన మెజారిటీతోనే అయినా.. ప్ర‌జాస్వామ్యం లో మెజారిటీదే అధికారం!

అయితే ఇప్పుడు మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ ప్ర‌బుత్వాన్ని కూల్చ‌డానికి బీజేపీ అన్ని అస్త్రాల‌నూ ఉప‌యోగించుకుంటూ ఉంది. ఈ విష‌యంలో కాంగ్రెస్ వ్య‌క్తం చేసిన ఆందోళ‌న నిజం అవుతూ ఉంది. సింధియాను ట్రంప్ కార్డుగా వాడి బీజేపీ కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదించ‌డం లాంఛ‌న‌మే!

అయితే ఇలా చేసి బీజేపీ సాధించేది ఏమిటి? ఆ పార్టీకి ప్ర‌జ‌లు ఇచ్చిన అధికారం ఉంది. ఉద్ధ‌రించాల‌నుకుంటే.. దానితో దేశాన్ని ఎంత‌గానో ఉద్ధ‌రించ‌వ‌చ్చు. అయినా త‌మ‌ను తిర‌స్క‌రించిన రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసి బీజేపీ సాధించ‌ల‌నుకుంటోంది?

ఒక‌వేళ త‌మ వ్య‌తిరేక ప్ర‌భుత్వాల‌ను కూల్చిన చోట బీజేపీ త‌క్ష‌ణం ఎన్నిక‌ల‌కు అయినా వెళ్తోందా? అంటే అదేమీ లేదు. క‌ర్ణాట‌క‌లో మ‌ధ్యంత‌రానికి వెళ్ల‌కుండా.. తిరుగుబాటు ఎమ్మెల్యేల‌ తో ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టుకుంది. రేపు మ‌ధ్యప్ర‌దేశ్ లో కూడా క‌మ‌లం పార్టీ ఎన్నిక‌ల‌కు వెళ్లే ధైర్యం చేయ‌క‌పోవ‌చ్చు. కాంగ్రెస్ తిరుగుబాటు దారుల ద్వారా, గ‌వ‌ర్న‌ర్ ను కేంద్రంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని అధికారాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అయితే.. ఇలాంటి చేష్ట‌లు ప్ర‌జాస్వామ్యానికి మంచివి కావు, ప్ర‌జ‌ల‌కు కూడా ప్ర‌తి సారీ న‌చ్చ‌వు! కేంద్రంలో ప్ర‌జ‌లిచ్చిన అధికారం తో సంతృప్తి చెంద‌క బీజేపీ చేస్తున్న ఇలాంటి ప‌నులు ఆ పార్టీపై దేశ వ్యాప్తంగా వ్య‌తిరేక‌త‌ను పెంచ‌వ‌చ్చు కూడా. ఇలాంటి అతి చేష్ట‌ల‌తోనే కాంగ్రెస్ హై క‌మాండ్ కూడా బాగా వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంద‌నే విష‌యాన్ని మరిచిపోవ‌డానికి వీల్లేదు!