Begin typing your search above and press return to search.

కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే పనిలో బీజేపీ.. దళితాస్త్రం

By:  Tupaki Desk   |   7 Feb 2022 2:30 AM GMT
కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే పనిలో బీజేపీ.. దళితాస్త్రం
X
తెలంగాణ సీఎం కేసీఆర్ పై అవకాశం చిక్కినప్పుడల్లా నిప్పులు చెరిగే నాయకుడు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. 2019 ఎన్నికల్లో కరీంనగర్ వంటి కీలక స్థానం నుంచి ఎంపీగా గెలిచి కేసీఆర్ కు షాకిచ్చారు సంజయ్. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన కరీంనగర్ లో సంజయ్.. టీఆర్ఎస్ ముఖ్య నేత బోయినపల్లి వినోద్ కుమార్ ను ఓడించి సంచలనం రేపారు. స్వతహాగానే దూకుడైన రాజకీయ నాయకుడిగా పేరున్న సంజయ్.. అదే ధోరణితో రాజకీయాల్లో సంచలనంగా మారారు.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఢీ అంటే ఢీ అంటూ ముందుకెళ్తున్నారు. సంజయ్ వాగ్ధాటితో పాటు ఆయన చేపట్టే కార్యక్రమాలు బీజేపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తున్నాయనడంలో సందేహమే లేదు. పార్టీ శ్రేణులను ముందుకు నడిపించడంలో తన ఆర్ఎస్ఎస్ అనుభవాన్ని ఉపయోగించుకుంటున్న సంజయ్.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యం అంటుంటారు. ఈ కోణంలోనే కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడుతూ.. ఎక్కడికక్కడ ఎండగడుతుంటారు. తాజాగా కేసీర్ తొలుత దగా చేసింది దళితులనే అంటూ కొత్త పాయింట్ లేవనెత్తారు.

కేసీఆర్ రాజ్యాంగం వ్యాఖ్యలకు ప్రతిగా

కేంద్ర బడ్జెట్ అనంతరం మోదీ సర్కారు తీరుపై కేసీఆర్ తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. కేంద్రం.. రాష్ట్రాల హక్కులను హరిస్తోందంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే అదనుగా రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు కేసీఆర్ ను టార్గెట్ చేశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలనడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనం అంటూ దళిత సంఘాలు దునుమాడుతున్నాయి. బీజేపీ మాత్రం ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన కారణంగా ఇంకా పూర్తిగా స్పందించలేదు. మోదీ తిరిగి వెళ్లిపోవడంతో ఇక కేసీఆర్ వ్యాఖ్యలపై విమర్శలకు దిగింది.

కేసీఆర్ మొదట మోసం చేసింది దళితులనే..

కేసీఆర్ సీఎం పదవి చేపట్టినంక మొట్టమొదట మోసం చేసింది దళితులనేని సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే దళితుడినే మొదటి ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచినంక మాట తప్పిండని అన్నారు. తానే సీఎం పదవి చేపట్టి దళితులను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని, దళితుడికి సీఎం పదవి ఏమైందని జనం నిలదీస్తుంటే… చర్చను దారి మళ్లించేందుకు ఒక్కో దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని మాయ మాటలు చెప్పిండు అని ఆయన ఆరోపించారు. దళితులకు మూడెకరాల సంగతి దేవుడెరుగు వాళ్ల పేరిటనున్న అసైన్డ్ భూములను కూడా లాక్కున్న నీచమైన చరిత్ర కేసీఆర్ ది అని మండిపడ్డారు.

ఇదేం పద్దతని సీఎంను అందరూ తిడుతుంటే… మళ్లీ ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కాగా అమలు చేస్తామన్నడు. ఆ హామీని కూడా గాలికొదిలేసిండు. హుజూరాబాద్ ఎలక్షన్లు రాంగనే మళ్లా ‘దళిత బంధు’ పేరుతో దళితులందరికీ ఒక్కొక్కరికీ 10 లక్షల రూపాయలిస్తానంటూ మాయమాటలు చెప్పిండు. కేసీఆర్ మాయమాటలను దళితులు కాదు కదా

జనం నమ్మలేదు. కర్రుకాల్చి వాత పెట్టిండ్రు. వందల కోట్లు ఖర్చు పెట్టినా ఓడించిండ్రు అని తెలంగాణ బీజేపీ చీఫ్ సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

ఆ వ్యాఖ్యలకు కౌంటర్ గానే

కేంద్రంపై బడ్జెట్ అనంతరం కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ ఆయనను మరో మెట్టు పైకి నిలిపింది. ఇదే సమయంలో మోదీ సర్కారును ఆత్మ రక్షణలోకి నెట్టింది. దేశంలో ఏ వర్గానికీ ఏమీ ఇవ్వని బడ్జెట్ గా మిగిలిపోయింది. దీన్నంతటినీ గమనించిన కేసీఆర్ సరైన సమయంలో ప్రెస్ మీట్ పెట్టి కేంద్రాన్ని కడిగేశారు. ఎలాగూ బడ్జెట్ ను చూసి రగిలిపోతున్న సాధారణ ప్రజలకు కేసీఆర్ ప్రెస్ మీట్ ఆనందం పంచి ఉంటుంది. దీంతోపాటు రాజకీయంగా ఆయనకు మంచి మైలేజీ కూడా ఇచ్చింది. మరోవైపు కేంద్రంపై కేసీఆర్ ఆ స్థాయిలో ధ్వజమెత్తి హీరోగా మిగిలితే.. రాష్ట్రంలో బీజేపీ ఏమీ చేయలేని సంకట స్థితిలో చిక్కుకుంది. ఇక కాంగ్రెస్ మాత్రం రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను పట్టుకుని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తోంది. ఎటూ పాలుపోని స్థితిలో ఉన్న బీజేపీ.. ‘‘సీఎం పదవి ఇస్తానంటూ కేసీఆర్ మొదట మోసం చేసింది దళితులనే అంటూ’’కొత్త రాగం ఎత్తుకుంది. తద్వారా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ దళితులను దగా చేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది.